నిఖిల్ చేస్తున్నది కరెక్టేనా..?

ఇష్టం ఉన్నా, లేకున్నా.. ఓ సినిమాకు ప్రచారం చేయాల్సిన బాధ్యత హీరోది. అంతర్గతంగా ఎన్ని సమస్యలున్నా, అభిప్రాయబేధాలున్నా, ఎవరితో పడినా పడకపోయినా.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, ముందుండి నడిపించాల్సిన వ్యక్తి హీరో. కానీ…

ఇష్టం ఉన్నా, లేకున్నా.. ఓ సినిమాకు ప్రచారం చేయాల్సిన బాధ్యత హీరోది. అంతర్గతంగా ఎన్ని సమస్యలున్నా, అభిప్రాయబేధాలున్నా, ఎవరితో పడినా పడకపోయినా.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, ముందుండి నడిపించాల్సిన వ్యక్తి హీరో. కానీ నిఖిల్ విషయంలో ఈ పెద్దరికం కొరవడింది.

స్పై సినిమాకు సంబంధించి నిఖిల్ కు, నిర్మాతకు పడడం లేదనే విషయం స్పష్టమైంది. నిఖిల్ కు ఇష్టంలేకుండానే రిలీజ్ డేట్ పోస్టర్ వేశారనే విషయం కూడా తేలిపోయింది. అలా అని నిర్మాతపై కోపంతో సినిమా ప్రచారానికి దూరంగా ఉంటే ఎవరికి నష్టం? అల్టిమేట్ గా రిజల్ట్ ఏదైనా హీరో ఖాతాలోకే వెళ్తుందనే విషయం నిఖిల్ కు తెలియదా?

స్పై సినిమాకు మంచి బజ్ వచ్చింది. టీజర్ అద్భుతంగా క్లిక్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో ప్రచారం చేసి, మరో హిట్ కొడదామనేది నిఖిల్ ఆలోచన. అందుకే పోస్ట్ పోన్ చేయమన్నాడు. కానీ నిర్మాత ససేమిరా అన్నాడు. కోట్ల నష్టం వస్తుంది కాబట్టి ఇంతకుముందు చెప్పిన తేదీకే రిలీజ్ చేద్దామన్నాడు. ఇక్కడే నిఖిల్ కు కోపం వచ్చింది.

దీంతో టోటల్ గా స్పై సినిమా ప్రచారాన్ని పక్కనపడేశాడు నిఖిల్. లిరికల్ వీడియోకు ప్రచారం చేయలేదు, రీసెంట్ గా వచ్చిన రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా పట్టించుకోలేదు. ఇప్పుడే ఇలా ఉంటే, వచ్చేవారం నుంచి ఇతడు ప్రచారానికి వస్తాడనే గ్యారెంటీ ఏంటి?

నిఖిల్ తెలుసుకోవాల్సిన అంశాలు..

ఇక్కడ నిఖిల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. కంటెంట్ లో దమ్ము  ఉంటే ప్రచారం కాస్త అటుఇటు అయినా సినిమా ఆడుతుంది. అప్పుడు ఆటోమేటిగ్గా ఆ సక్సెస్ నిఖిల్ ఖాతాలోనే చేరుకుంది. అదే టైమ్ లో సినిమా ఫ్లాప్ అయినా ఆ రిమార్క్ నిఖిల్ కే. కాబట్టి ఉన్న ఈ కాస్త టైమ్ లోనే సినిమాకు ప్రచారం కల్పించాల్సిన బాధ్యత ఈ హీరోపై ఉంది.

కార్తికేయ-2 సినిమా దేశవ్యాప్తంగా హిట్ అవుతుందని, విడుదలకు ముందు నిఖిల్ ఊహించలేదు. కానీ అది పెద్ద హిట్టయింది. దీంతో రిలీజ్ తర్వాత చాలా ప్రాంతాల్లో నిఖిల్ పర్యటించాడు. సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లాడు. మరి అదే వ్యూహాన్ని స్పై సినిమాకు కూడా ఫాలో అవ్వొచ్చు కదా. మొత్తానికే మడికట్టుక్కూర్చుంటే ఏంటి అర్థం.

నిఖిల్ కోణంలో చూసుకుంటే నిర్మాతది తప్పే అవ్వొచ్చు. దేశవ్యాప్తంగా హిట్టవ్వాల్సిన మంచి కంటెంట్ ను, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా నిర్మాత ఇలా హడావుడిగా వదిలేస్తున్నాడనే బాధ నిఖిల్ కు ఉండడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు చేసేదేం లేదు. నిర్మాత తన మాట విననప్పుడు, తను నిర్మాత దారిలోకి వెళ్లాల్సిందే. సహాయనిరాకరణ చేస్తానంటే, అది అది తన కెరీర్ కే ఇబ్బంది అనే విషయాన్ని నిఖిల్ గ్రహించాలి. 

ఈ సినిమా తర్వాత సదరు నిర్మాత మరో హీరోతో సినిమా చేసుకుంటాడు. కానీ ఈ సినిమా ఫలితాన్ని (అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా) జీవితాంతం మోయాల్సింది తనే అనే విషయం నిఖిల్ గ్రహించాలి.