ముందే ఊహించారా.. అందుకే లైట్ తీసుకున్నారా?

ఏ సినిమాకైనా గట్టిగా ప్రచారం చేస్తారు. మొదటి రోజు రిజల్ట్ బాగుంటే, ప్రమోషన్ ను ఇంకా కొనసాగిస్తారు. రిజల్ట్ తేడాకొడితే, అక్కడితో సినిమాను వదిలేస్తారు. ఏ సినిమాకైనా ఈ ప్రాసెస్ సహజం. మరి విడుదలకు…

ఏ సినిమాకైనా గట్టిగా ప్రచారం చేస్తారు. మొదటి రోజు రిజల్ట్ బాగుంటే, ప్రమోషన్ ను ఇంకా కొనసాగిస్తారు. రిజల్ట్ తేడాకొడితే, అక్కడితో సినిమాను వదిలేస్తారు. ఏ సినిమాకైనా ఈ ప్రాసెస్ సహజం. మరి విడుదలకు ముందే ప్రచారాన్ని గాలికొదిలేస్తే ఏమనుకోవాలి? ఆదిపురుష్ విషయంలో ఇదే జరిగింది.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సినిమా. ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్. దేశవ్యాప్తంగా అంచనాలు. రామాయాణం బేస్ చేసుకొని తీసిన మూవీ. ఇలాంటి సినిమాకు ప్రమోషన్ ఎలా చేయాలి? ఇండియా మొత్తం దద్దరిల్లిపోవాలి. కానీ ఒకేఒక్క గ్రౌండ్ ఈవెంట్ చేశారు. ఇంటర్వ్యూలు, టూర్స్ లాంటివన్నీ పక్కనపడేశారు. సైలెంట్ గా పక్కకు తప్పుకున్నారు.

ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందు వ్యవహారం ఇది. అప్పుడే చాలామందికి డౌటొచ్చింది. మేకర్స్ ఇలా కాడె పడేయడంతో, చాలామంది మనసుల్లో అనుమాన బీజం నాటుకుంది. అదే ఇప్పుడు నిజమైంది. ఆదిపురుష్ సినిమాపై పెను దుమారం రేగుతుందని మేకర్స్ ముందుగానే ఊహించినట్టున్నారు. అందుకే విడుదలకు 4 రోజుల ముందు నుంచే అంతా సర్దుకున్నారు. మీడియాకు దొరక్కుండా తప్పించుకున్నారు.

సినిమా విడుదలైన తర్వాత అంతా గప్ చుప్. ఓంరౌత్ కనిపించలేదు, ప్రభాస్ ఎప్పట్లానే మాయం. నిర్మాతలు స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు కానీ బయటకురావడం లేదు. ఉన్నంతలో రచయిత మనోజ్ మాత్రం మీడియా ముందుకొచ్చాడు. కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ చీవాట్లు తింటున్నాడు.

ఇక్కడే మరో అంశాన్ని కూడా లేవనెత్తుతున్నారు కొంతమంది. ఆదిపురుష్ సినిమాపై వివాదాలు చెలరేగుతాయని మేకర్స్ ముందుగానే ఊహించారట. అందుకే టైటిల్స్ లో చాలామంది రాజకీయ నాయకుల పేర్లు కవర్ చేశారు. వీళ్ల ఆశీర్వాదంతో సినిమాను రిలీజ్ చేస్తున్నామని ముందే ప్రకటించుకున్నారు. ఎవరైతే అభ్యంతరం తెలిపే ప్రమాదం ఉందని మేకర్స్ భావించారో, వాళ్లందర్నీ ఈ లిస్ట్ లో కవర్ చేయడం విశేషం. అయినప్పటికీ ట్రోలింగ్ ఆగలేదు, కోర్టు కేసులు తప్పలేదు.

ఇవన్నీ ముందే ఊహించినట్టున్నారు మేకర్స్. అందుకే విడుదలకు ముందే సైలెంట్ అయ్యారు. ఇప్పుడు చోద్యం చూస్తున్నారు.