సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన మొహమాటం?

ప్రేమించుకునేటప్పుడు కెమెరాలకు దొరికిపోతామేమో అనే భయం ఉండడం సహజం. అందుకే నటీనటులు డేటింగ్ లో ఉండేటప్పుడు చాలా గుంభనంగా వ్యవహరిస్తారు. ఎవరి కంట పడకుండా జాగ్రత్తపడతారు. అదే ప్రేమ ఫలించి, పెద్దల ఆశీర్వాదం కూడా…

ప్రేమించుకునేటప్పుడు కెమెరాలకు దొరికిపోతామేమో అనే భయం ఉండడం సహజం. అందుకే నటీనటులు డేటింగ్ లో ఉండేటప్పుడు చాలా గుంభనంగా వ్యవహరిస్తారు. ఎవరి కంట పడకుండా జాగ్రత్తపడతారు. అదే ప్రేమ ఫలించి, పెద్దల ఆశీర్వాదం కూడా దక్కి, ఏకంగా నిశ్చితార్థం కూడా జరిగితే? ఎవరికైనా ఇంతకంటే ఇంకేం కావాలి.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ఇదే జరిగింది. చాన్నాళ్లూ సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట, ఇప్పుడు పెళ్లితో ఒకటౌతోంది. రీసెంట్ గా వీళ్ల ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. ఎంగేజ్ మెంట్ తర్వాత కూడా ఈ జంట తిరిగి తమ పాత పద్ధతిలోనే నడుచుకుంటోంది.

నిశ్చితార్థం పూర్తయిన తర్వాత కాబోయే భార్యభర్తలిద్దరూ ఎవరిపనిలో వాళ్లు పడిపోయారు. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం 2 వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఆమె చేతిలో ఒక తమిళ సినిమా కూడా ఉంది. ఎంగేజ్ మెంట్ అయిన 2 రోజులకే ఆమె ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కు వెళ్లిపోయింది. ఇక వరుణ్ తేజ్ సంగతి సరేసరి. ఆయన చేతిలో 2 సినిమాలున్నాయి. వాటికి సంబంధించిన పనుల్లో అతడు బిజీ అయిపోయాడు.

నిశ్చితార్థం తర్వాత వీళ్లను కదిపే ప్రయత్నం చేసింది మీడియా. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ప్రేమ కబుర్లను ప్రేక్షకులకు అందించాలని కొంతమంది ప్రయత్నించారు. కానీ ఇంటర్వ్యూ కాదు కదా, కనీసం కలిసి కనిపించడానికి కూడా ఈ జంట ఇష్టపడడం లేదు.

ప్రేమలో ఉన్న ఎన్నో జంటలు మీడియా ముందు హడావిడి చేస్తున్న ఈ రోజుల్లో.. పెళ్లికి కూడా సిద్ధమై, గుంభనంగా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు వరుణ్-లావణ్య. ఇది సిగ్గా.. భయమా.. మొహమాటమా..? లేక సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన మొహమాటమా?