ఆలియా భట్ నటించిన ‘సడక్ 2’ ట్రెయిలర్‌కి కోటికి పైగా డిస్ లైక్స్ రావడం సంచలనమయింది. సుషాంత్ సింగ్ రాజ్పుట్ మరణానంతరం బాలీవుడ్లో కొందరు ప్రముఖులపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. వారిలో ఆలియా భట్, మహేష్ భట్ ముందు వరుసలో వుండడంతో ఈ ట్రెయిలర్‌కి డిస్ లైక్స్ కొట్టడం ద్వారా తమ కోపాన్ని, అలాగే దివంగత నటుడిపై ప్రేమనీ చాటుకుంటున్నారు సుషాంత్ అభిమానులు.
అయితే ఎంత ఆగ్రహం వున్నా ఈ స్థాయిలో నిరసన వుంటుందా? పనిగట్టుకుని మరీ ట్రెయిలర్ లింక్ ఓపెన్ చేసి డిస్ లైక్ కొడతారా? దీనిపై విచిత్రమైన కథనాలు వెలువడుతున్నాయి. ఎలాగో ఈ సినిమా సుషాంత్ సానుభూతిపరులకు టార్గెట్ కనుక దానినే ప్రచారాంగా వాడుకోవడానికి ఈ చిత్ర బృందం బాట్స్‌తో డిస్ లైక్స్ పర్వాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లిందని అంటున్నారు.
రివర్స్ స్ట్రాటజీతో పబ్లిసిటీ మరింత పెంచుకోవడం లాంటిదన్నమాట. బాలీవుడ్ అంటేనే మార్కెటింగ్ ట్రిక్స్‌లో ఘనాపాటి. కనుక ఈ రివర్స్ గేమ్ ప్లాన్ సదరు చిత్ర బృందమే చేసి వున్నా ఆశ్చర్యం లేదు. లేదంటే చాలా మామూలుగా వున్న ఆ ట్రెయిలర్‌కి అన్ని వ్యూస్, ఇంత పబ్లిసిటీ వచ్చి వుండేదే కాదు. ఏదేమైనా సుషాంత్ మరణానంతరం ఇండియన్ సోషల్ మీడియా బాగా వేడెక్కిపోయింది. సెలబ్రిటీలు కూడా ట్రోల్స్‌కి దొరక్కుండా ‘కవర్స్’ తీసుకునేంతగా.