ప్రస్తుతానికి ఈ జగన్ కంటే, ఆ జగనే బాగున్నాడు

రీమేక్ చేస్తున్నప్పుడు ఎలాగైతే సహజంగా ఇద్దరు హీరోల మధ్య కంపారిజన్ ఉంటుందో.. ఒకే పాత్రను ఇద్దరు హీరోలు పోషిస్తున్నప్పుడు కూడా అలాంటి పోలిక సహజం. ఇప్పుడు అలాంటి సందర్భం రానే వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్…

రీమేక్ చేస్తున్నప్పుడు ఎలాగైతే సహజంగా ఇద్దరు హీరోల మధ్య కంపారిజన్ ఉంటుందో.. ఒకే పాత్రను ఇద్దరు హీరోలు పోషిస్తున్నప్పుడు కూడా అలాంటి పోలిక సహజం. ఇప్పుడు అలాంటి సందర్భం రానే వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రను, ఇద్దరు ఆర్టిస్టులు పోషిస్తున్నారు. రెండు సినిమాల్లో నటిస్తున్నారు. మరి వీళ్లలో ఎవరు జగన్ కు దగ్గరగా ఉన్నారు.

జగన్ చుట్టూ తిరిగే కథతో ఆర్జీవీ ఓ సినిమా తీస్తున్నాడు. దీనికి వ్యూహం అనే పేరు పెట్టాడు. ఇందులో జగన్ పాత్ర కోసం అజ్మల్ ను తీసుకున్నాడు. ఫస్ట్ లుక్ తో పాటు టీజర్, సాంగ్ కూడా రిలీజ్ చేశాడు. ఇందులో జగన్ హావభావాల్ని అచ్చుగుద్దినట్టు దించేశాడు అజ్మల్. డబ్బింగ్ కూడా జగన్ ఒరిజినల్ వాయిస్ కు దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడ్డారు.

ఇక తాజాగా యాత్ర-2 కూడా రెడీ అవుతోంది. యాత్ర సినిమాను వైఎస్ఆర్ పై తీసిన మహి వి రాఘవ్, యాత్ర-2లో జగన్ పై ఫోకస్ పెట్టాడు. 2009 నుంచి 2019 వరకు జగన్ మోహన్ రెడ్డి రాజకీయ, వ్యక్తిగత జీవితాన్ని చూపించబోతున్నాడు. ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా ప్రజెంట్ చేస్తూనే, యథార్థ సంఘటనలతో పాటు, జనాలను ఆకట్టుకునేలా ఫిక్షన్ డ్రామా కూడా యాడ్ చేస్తున్నాడు.

తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్ చుట్టూ యాత్ర-2 సాగుతుంది. ఈ సినిమాలో జగన్ పాత్ర కోసం జీవాను తీసుకున్నాడు మహి. ప్రస్తుతానికి ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశాడు. యాత్ర-2, వ్యూహం సినిమాల్లో జగన్ పాత్రల్ని పోల్చి చూస్తే.. ప్రమోషనల్ మెటీరియల్ వల్ల వ్యూహం సినిమాలో జగన్ పాత్రే ఎక్కువగా ఆకర్షిస్తోంది.

అయితే మహి వి రాఘవ్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. యాత్ర కోసం మమ్ముట్టిని రంగంలోకి దించిన ఈ దర్శకుడు, వైఎస్ఆర్ ను మరోసారి వెండితెరపై ఆవిష్కరించాడు. ఇప్పుడు జగన్ క్యారెక్టర్ కోసం జీవాను తీసుకున్నాడంటే, ఎంతో ఆలోచించే ఉంటాడు. కాబట్టి యాత్ర-2కు సంబంధించి మరింత ప్రమోషనల్ కంటెంట్ బయటకొచ్చిన తర్వాత మాత్రమే.. జగన్ ను పోలిన పాత్రలో ఎవరు బాగా రాణించారనేది చెప్పగలం. ప్రస్తుతానికైతే అజ్మల్ దే పైచేయి.