ఇప్పుడు కాదు, ఆ రోజు మాట్లాడతాను

ఛార్జ్ షీట్ ను కోర్టు ముందుంచి, ఆధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయమని కోరబోతున్నట్టు సమాచారం.

ఉన్నట్టుండి సెడన్ గా మరోసారి తెరపైకి వచ్చింది జానీ మాస్టర్ కేసు. తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఓ మహిళను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై అతడిపై కేసు పడింది. మరీ ముఖ్యంగా అత్యాచారం జరిగిన సమయానికి తను మైనర్ నని బాధితురాలు చెప్పడంతో, జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

ఈ కేసులో అరెస్టైన జానీ మాస్టర్, కొన్నాళ్ల జైలు జీవితం తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పుడా కేసుకు సంబంధించి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రకరకాల ఈవెంట్స్ పేరుతో బాధితురాల్ని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ అందులో పేర్కొన్నారు. అదే విధంగా ముంబయిలో కూడా బాధితురాలిపై అత్యాచారం జరిగిందని అందులో నమోదు చేశారు.

తన పేరు, తనకు సంబంధించిన కేసు మరోసారి వార్తల్లోకి రావడంతో జానీ మాస్టర్ రాత్రి వీడియో రిలీజ్ చేశాడు. తనకు చట్టంపై గౌరవం, విశ్వాసం ఉందంటూనే ఇప్పుడేం మాట్లాడనని, నిర్దోషిగా బయటకొచ్చిన రోజు అన్ని విషయాలు బయటపెడతానని ప్రకటించాడు.

“న్యాయస్థానంపై నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతుంది. ఆ నమ్మకంతోనే నేను బయటకొచ్చి నలుగురితో పనిచేసుకుంటున్నాను. నా కుటుంబంతో హ్యాపీగా ఉన్నాను. ఏం జరిగిందనేది నా మనసుకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. నేను క్లీన్ చిట్ తో, నిర్దోషిగా బయటకొస్తాను. ఆరోజు నేను మాట్లాడతాను. అప్పటివరకు నేను నిందితుడ్ని మాత్రమే.”

మరోవైపు పోలీసులు జానీ మాస్టర్ బెయిల్ రద్దుపై కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఛార్జ్ షీట్ ను కోర్టు ముందుంచి, ఆధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయమని కోరబోతున్నట్టు సమాచారం.