200 కోట్ల రూపాయల విలువైన స్కామ్ లో జైలు పాలైన సుఖేష్ చంద్రశేఖరన్ తో భారీ ఎత్తున గిఫ్ట్ లు తీసుకుందనే కారణంతో కేసులను ఎదుర్కొంటోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. అతడి నుంచి ఆమె 12 కోట్ల రూపాయలకు పై విలువైన బహుమతులు పొందిందనేది ఈడీ మోపిన అభియోగం. ఈ వ్యవహారంలో ఆమె పై ఇప్పటికే చార్జిషీట్లు దాఖలయ్యాయి.
అంతే కాదు.. ఆమె వ్యక్తిగత అకౌంట్ నుంచి ఆ మేరకు సొమ్మును ఈడీ అటాచ్ కూడా చేసింది. అలాగే ఆమె పాస్ పోర్టును కూడా ఆ మధ్య సీజ్ చేసినట్టుగా ఉంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. జాక్వెలిన్ విదేశాలకు వెళ్లిపోకుండా ఇలా నిరోధించారు.
సుఖేష్ చంద్రశేఖరన్ కేసుల్లో జాక్వెలిన్ పేరు తరచూ వినిపిస్తూనే ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఆమె తన సినిమాలు, షో ల్లో బిజీగా ఉంది. పన్నెండు కోట్ల రూపాయల మేర అతడి నుంచి ఆమెకు బహుమతులు దక్కితే, ఆ మేరకు ఇప్పటికే ఈడీ ఆమె ఆస్తులను అటాచ్ చేసింది కాబట్టి.. చెల్లుకు చెల్లయ్యిందనుకోవాలేమో!
అయితే జాక్వెలిన్ కేవలం అతడి గర్ల్ ఫ్రెండ్ గా గడుపుతూ.. ఆ బహుమతులు పొందలేదట. అతడిని ఆమె పెళ్లి కూడా చేసుకోవాలనుకుందట! గర్ల్ ఫ్రెండ్ గా అతడితో సన్నిహితంగా మెలుగుతూ, వీలైనంతగా అతడు ఇచ్చిన గిఫ్ట్ లను తీసుకుని.. ఇస్తున్నాడు కాబట్టి తీసుకోవాలనే తత్వంతో అతడితో మెలగలేదట జాక్వెలిన్. అతడిని ఆమె ప్రేమించిందని, నమ్మి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుందని ఆమె సన్నిహితులు ఇప్పుడు తీరికగా చెబుతున్నారట.
అయితే అప్పటికే సుఖేష్ తీరు అనుమానాస్పదంగా ఉన్నా.. ఆమె అతడిని నమ్మిందనేది ఆమె సన్నిహితులు వ్యక్తం చేస్తున్న ఆశ్చర్యం. మరి పెళ్లి అయితే చేసుకోలేదు. అతడి నుంచిన పొందిన బహుమతుల స్థాయి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మరి ఈ వ్యవహారంలో జాక్వెలిన్ ఇంకా ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందో!