మునుగోడు ఉప ఎన్నిక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కఠిన పరీక్షే! పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ తన ఉనికిని చాటుకోవాలంటే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం మాట ఎలా ఉన్నా.. కనీసం రెండో స్థానంలో నిలవాలి. అదీ కాదంటే డిపాజిట్ దక్కించుకోవడం, కనీసం పోటీలో ఉండటం.. చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను సంపాదించుకోవడం.. ఇవన్నీ గణాంకాలే!
కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లు వచ్చాయనే లెక్క దగ్గర నుంచి.. రకరకాల అంశాలు రేవంత్ నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలవబోతున్నాయి. అసలే రేవంత్ పై కాంగ్రెస్ లోనే చాలా అసంతృప్తులున్నాయి. అసహనాలున్నాయి. మునుగోడులో గనుక కాంగ్రెస్ పరువు నిలబెట్టుకోలేకపోతే.. రేవంత్ పై చెలరేగిపోతారు స్వపార్టీలోని ప్రత్యర్థులు. ఢిల్లీకి సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్లి మరీ వాళ్లు కంప్లైంట్లు చేస్తారు కూడా!
మరి ఈ విషయాలేవీ రేవంత్ రెడ్డికి తెలియనివి కావు. అందుకే ఆయన కూడా రకరకాల వ్యూహాలను అనుసరిస్తూ పరువు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ చాలా మంది నేతలను మొహరించింది. మండలానికి ఇద్దరు ముగ్గురు నేతలకు బాధ్యలను అప్పగించింది. అనేక మందిని అదనంగా దించింది. మరి వీరందరికీ వ్యక్తిగత టార్గెట్ ఒకటేనట! తమకు బాధ్యతలు అప్పగించిన చోట మెజారిటీని తెప్పించడం.
మరి ఇందుకు దక్కే ప్రతిఫలం ఏమిటో కూడా రేవంత్ సదరు నేతలకు చెప్పారట. ఎవరైతే తమకు బాధ్యతలను ఇచ్చిన చోట మెజారిటీని తెప్పిస్తారో.. వారికి వారి సొంత నియోజకవర్గం టికెట్ ఖరారు అయినట్టే అంటున్నారట రేవంత్ రెడ్డి.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు మునుగోడును రంగస్థలంగా వాడుకోవచ్చని.. ఇక్కడ ఒక వార్డు బాధ్యతలు తీసుకుని, అక్కడ మెజారిటీ తెప్పించినా సరే.. వారికి సొంత నియోజకవర్గం టికెట్ కోసం తను అధిష్టానం వద్ద పోరాడుతానంటూ రేవంత్ మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిలకు భరోసా ఇస్తున్నారట. మరి రేవంత్ ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్.. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పరువును ఏ మేరకు నిలబెడుతుందో!