తెలుగులో హిట్ అయిన జెర్సీ సినిమా హిందీ రీమేక్ పై దాఖలైన కాపీ రైట్ వివాదపు పిటిషన్ పై విచారణ ఆసక్తిదాయకంగా సాగుతూ ఉంది. హిందీ జెర్సీ విడుదలను ఆపాలని, ఈ సినిమా కథ తను రాసిందని, తను రాసినదాన్ని కాపీ కొట్టి ఈ సినిమా రూపొందించాలని ఒక వ్యక్తి బాంబే హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఇది వరకే. ఆ పిటిషన్ విచారణ కొనసాగుతూ ఉంది.
ఈ సందర్భంగా కోర్టు నుంచి ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు వచ్చాయి. ఈ కథ తనదంటూ పిటిషన్ వేసిన వ్యక్తికి ఈ సినిమా టైటిల్స్ లో క్రెడిట్ ఇస్తారేమో ఆలోచించుకొండి అంటూ.. ఈ సినిమా రూపకర్తలకు కోర్టు సూచించింది.
ఒకవైపు ఈ కథ తనదని అంటున్న వ్యక్తికి కీలకమైన ప్రశ్నలు సంధిస్తూనే, ఇదే సమయంలో అతడికి ఈ బాలీవుడ్ మూవీ ప్రొడ్యూసర్లు కథా రచనలో క్రెడిట్ ఇస్తారేమో ఆలోచించుకోవాలని కోర్టు చెప్పింది. జెర్సీ సినిమా ముందుగా తెలుగులో వచ్చింది కదా, దానికి రీమేక్ గా కదా హిందీలో సినిమాను రూపొందిస్తూ ఉన్నారు.. అలాంటప్పుడు నువ్వు తెలుగు సినిమాపై ఎందుకు పిటిషన్ వేయలేదు? అని కోర్టు సదరు రచయితను ప్రశ్నించింది.
2007లోనే తను ఆ కథను రాసుకున్నట్టుగా అతడు కోర్టుకు చెబుతున్నాడు. అలాంటప్పుడు తెలుగులో అదే కథ సినిమాగా వచ్చినప్పుడు ఏం చేశావని కోర్టు ప్రశ్నించింది. దీనిపై అతడి లాయర్ స్పందిస్తూ తన క్లైంట్ నేటివ్ తెలుగు స్పీకర్ కాదని, దీంతో అతడికి తన కథతో సినిమా వచ్చిన విషయం తెలియదని కోర్టుకు విన్నవించాడు.
తెలుగులో తన కథను కాపీ కొట్టిన విషయం తన క్లైంట్ కు తర్వాత తెలిసిందని, అదే కథ హిందీ రీమేక్ నేఫథ్యంలో కోర్టును ఆశ్రయించినట్టుగా ఆ లాయర్ చెప్పుకొచ్చాడు. ఈ కేసు విచారణ ఇలా కొనసాగుతూ ఉండగా.. వీలైతే సదరు పిటిషనర్ కు టైటిల్ కార్డ్స్ లో క్రెడిట్ ఇస్తారేమో ఆలోచించుకొండంటూ బాంబే హైకోర్టు హిందీ జెర్సీ రూపకర్తలకు సూచించడం గమనార్హం! ఈ వ్యవహారాన్ని ఏదోలా తేల్చుకోవడానికి ఈ సినిమా రూపకర్తలకు కోర్టు కూడా అవకాశం ఇచ్చినట్టేనేమో!