రజినీకాంత్ కుమార్తె ఇంట్లో భారీ చోరీ

సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె, ఐశ్వర్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. వజ్రాలు, బంగారు నగలను దొంగలెత్తుకెళ్లారు. అది ఇంటి దొంగల పనేనంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్, ఇద్దరు పనిమనుషులపై…

సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె, ఐశ్వర్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. వజ్రాలు, బంగారు నగలను దొంగలెత్తుకెళ్లారు. అది ఇంటి దొంగల పనేనంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్, ఇద్దరు పనిమనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఐశ్వర్య. 60 సవర్ల బంగారు ఆభరణాలు, ఇతర వజ్రాలు పోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు ఐశ్వర్య.

వేసిన తాళం వేసినట్టే ఉంది..

ఐశ్వర్య, ధనుష్ వివాహం 2004లో జరిగింది. కుటుంబ సభ్యులు పెళ్లి కోసం చేయించిన ఆభరణాలన్నిటినీ ఆమె తనతోనే ఉంచుకున్నారు. సెయింట్ మేరీస్ రోడ్ లోని అపార్ట్ మెంట్ లో ఓ లాకర్ లో ఆ నగలు దాచి ఉంచేవారు ఐశ్వర్య. 2019 లో ఆమె చెల్లెలి వివాహం సందర్భంగా చివరిసారిగా వాటిని ధరించానని, ఆ తర్వాత వాటిని లాకర్ లో పెట్టి తాళం వేశానని, తీరా ఇటీవల లాకర్ తెరిచి చూస్తే నగలు లేవని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఐశ్వర్య. లాకర్ కి తాళం వేసినట్టే ఉంది, లోపల విలువైన నగలు మాయమయ్యాయి. అయితే కొన్ని నగలు మాత్రం ఆ లాకర్ లోనే ఉన్నాయి. దీంతో ఆమెకు దొంగతనం అనే అనుమానం రాలేదు. ఇళ్లంతా వెదికింది. చివరకు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు.  

లాకర్ అటు ఇటు..

2019లో చివరిసారిగా ఆ నగలు పెట్టుకున్నానని చెబుతున్న ఐశ్వర్య వాటిని లాకర్ లో పెట్టి తాళం వేసిన తర్వాత ఆ లాకర్ ను మూడుసార్లు అటు ఇటు మార్చారట. సెయింట్ మేరీస్ రోడ్ లోని అపార్ట్ మెంట్ నుంచి సీఐటీ కాలనీలోని ఇంటికి తీసుకొచ్చారు. అక్కడినుంచి తిరిగి సెయింట్ మేరీస్ రోడ్ లోని అపార్ట్ మెంట్ కి తిరిగి తీసుకెళ్లారు. ఆ తర్వాత పోయెస్ గార్డెన్ లోని రజినీకాంత్ ఇంటికి చివరిగా తీసుకొచ్చారు. అక్కడ లాకర్ ఓపెన్ చేసి చూస్తే నగలు మాయమయ్యాయి.

ఇంటి దొంగల పనే..

ఐశ్వర్య ఇంట్లో పనిచేసే ముగ్గురు పనివాళ్లపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. డ్రైవర్ తోపాటు, ఇద్దరు పనిమనుషులకు ఆ లాకర్ తాళాలు ఎక్కడ ఉంటాయనే విషయం తెలుసని చెప్పారామె. లాకర్ తాళాలను ఓ కప్ బోర్డ్ లో పెడతానని, ఆ విషయం కొన్నిసార్లు పనిమనుషులకు తానే చెప్పానని అన్నారు. వారే ఈ నగలు మాయం చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

18 ఏళ్ల క్రితం పెళ్లికి చేయించుకున్న నగలు, వజ్రాభరణాలు మాయమయ్యే సరికి ఆమె చాలా బాధపడ్డారు. సెంటిమెంట్ నగలు పోయాయని పోలీసులకు చెప్పారు. వాటిని ఎలాగైనా రికవరీ చేయాలని కోరారు.