రైల్వే ప్లాట్ ఫామ్స్ పై రైళ్ల టైమింగ్స్, ప్లాట్ ఫామ్ వివరాలు తెలిపేందుకు ఎల్ఈడీ స్క్రీన్స్ పెడుతుంటారు. వీటిలో అడ్వర్టైజ్ మెంట్లు కూడా వస్తుంటాయి. ఆ అడ్వర్టైజ్ మెంట్ల మధ్యలో సడన్ గా ఓ బూతు వీడియో వచ్చింది. అసభ్యంగా ఉన్న ఆ వీడియో చూసి వెంటనే ప్రయాణికులు షాకయ్యారు. ఎవరో పొరపాటున ప్లే చేసి ఉంటారు, వెంటనే దాన్ని మార్చేస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మూడు నిమిషాలసేపు ఆ బూతు వీడియో టీవీల్లో వస్తూనే ఉంది. దీంతో కలకలం రేగింది. ఈ ఘటన బీహార్ లోని పాట్నాలో జరిగింది.
నిత్యం రద్దీగా ఉండే పాట్నా రైల్వే స్టేషన్లోని టీవీల్లో పోర్న్ వీడియో క్లిప్ టెలికాస్ట్ కావడం సంచలనంగా మారింది. దీనిపై ప్రయాణికులు అక్కడే నిరసన తెలిపారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. చివరకు రైల్వే పోలీసుల టెలికాస్ట్ రూమ్ లో కి వెళ్లి ఆ వీడియోని ఆపివేయించారు. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. చాలామంది ప్రయాణికులు టెలికాస్ట్ అవుతున్న వీడియోని, రైల్వే పరిసరాలను తమ సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఏజెన్సీపై కేసు..
బీహార్ లోని రైల్వే స్టేషన్లలో యాడ్స్ టెలికాస్ట్ చేసేందుకు ఓ యాడ్ ఏజెన్సీని అధికారులు ఎంపిక చేశారు. దత్తా కమ్యూనికేషన్ అనే సంస్థ బీహార్ రైల్వే స్టేషన్లలో అడ్వర్టైజ్ మెంట్లు టెలికాస్ట్ చేస్తుంది. స్థానిక వ్యాపార సంస్థల యాడ్స్ ని రైల్వే ప్లాట్ ఫామ్స్ పై టెలికాస్ట్ చేస్తుంది. ఆ సంస్థలో ఉన్న కొంతమంది సిబ్బంది చేసిన తప్పు వల్లే పోర్న్ వీడియో టెలికాస్ట్ అయింది. దీంతో అధికారులు సదరు దత్తా కమ్యూనికేషన్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. కేసు నమోదు చేశారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా, రైల్వే అధికారులను ట్యాగ్ చేస్తూ చాలామంది ప్రయాణికులు ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అధికారులకు తలకొట్టేసినట్టు అయింది. సీఎం నితీష్ కూడా ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. దత్తా కమ్యూనికేషన్ పై చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు రైల్వే అధికారులు.