ఇదో వెరైటీ పోలిక. తన హీరో విశ్వక్ సేన్ కు సంబంధించి నివేత పెతురాజ్ ఈ పోలిక తీసుకొచ్చింది. విశ్వక్ సేన్ మెగాస్టార్ అంత అవుతాడని అనొచ్చు. విశ్వక్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని కూడా మెచ్చుకోవచ్చు. కానీ విశ్వక్ సేన్ కు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లింక్ పెట్టింది ఈ హీరోయిన్.
“హీరో నిర్మాతగా చేయడం వేరు. కానీ దర్శకత్వం ఒక ప్రధాన బాధ్యత. హీరో, నిర్మాత దర్శకత్వం ఇలా మూడు బాధ్యతలని తీసుకున్నారు విశ్వక్. నిర్మాతగా పూర్తి న్యాయం చేశారు. ఎప్పుడు ఏం కావాలన్నా సమకూర్చారు. ఇక దర్శకుడిగా అయితే విశ్వక్ ఎనర్జీ చాలా గొప్పగా అనిపించింది. నేను పని చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత అంత ఎనర్జీ వున్న దర్శకుడిని విశ్వక్ సేన్ లో చూశాను.”
ఇలా విశ్వక్ సేన్ ను త్రివిక్రమ్ తో పోల్చింది ఈ హీరోయిన్. దాస్ కా ధమ్కీ సినిమాలో విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ, తన హీరో కమ్ డైరక్టర్ ను ఇలా ఆకాశానికెత్తేసింది. విశ్వక్ ను దర్శకుడిగా కొనసాగవద్దని ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను అంగీకరించడం లేదు నివేత.
“విశ్వక్ గొప్ప ఎనర్జీ ఉన్న దర్శకుడు. తన దగ్గర చాలా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. అయితే తానే నటుడిగా కాకుండా వేరే హీరోలని డైరెక్ట్ చేయాలని నా అభిప్రాయం. విశ్వక్ లో చాలా మాస్ ఉంది. లోకేష్ కనకరాజ్ లాంటి టచ్ ఉంది. బాలకృష్ణ లాంటి పెద్ద మాస్ హీరోలని డైరెక్ట్ చేసే సత్తా విశ్వక్ లో ఉంది. తనకి గ్యాంగ్ స్టర్ సినిమాలంటే పిచ్చి. తను చాలా మంచి గ్యాంగ్ స్టర్ డైరెక్టర్ అవుతారు. తన దగ్గర చాలా మంచి కథలు వున్నాయి.”
ఎన్టీఆర్, విశ్వక్ ను డైరక్షన్ ఆపేయమని చెబితే.. నివేత మాత్రం తన హీరోను డైరక్షన్ కొనసాగించమని చెబుతోంది. కెరీర్ లో తొలిసారి దాస్ కా ధమ్కీ మూవీలో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయాన్ని కన్ ఫర్మ్ చేసింది. ఈ ఏడాది హిందీలో ఓ సినిమా చేస్తోంది.