శంకర్-చరణ్ సినిమాలో భారీ ఫైట్, కోట్ల రూపాయల సెట్. ఎన్టీఆర్-కొరటాల సినిమా కోసం డిఫరెంట్ సెటప్, భారీ తారాగణం. బన్నీ కొత్త సినిమాలో అదిరిపోయే ఫైట్లు, పాటలు. ఇలా రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలపై రోజుకో అప్ డేట్ వస్తూనే ఉంటుంది. దాన్ని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తూనే ఉంటారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ హీరోలు ఈ ఏడాది ఇలా వార్తలకే పరిమితం అవుతారు. వాళ్ల సినిమాలేవీ ఈ ఏడాది థియేటర్లలోకి రావు.
శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ శంకర్ తో వ్యవహారం మామూలుగా ఉండదు. అందుకే ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి రావడం లేదు. అంటే.. చరణ్ కు సంబంధించి ఈ ఏడాది మొత్తం ఫీలర్లు మాత్రమే వస్తాయి, సినిమా రాదన్నమాట.
అటు అల్లు అర్జున్ సినిమా పుష్ప-2 కూడా అంతే. సుకుమార్ ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఈ సినిమా రాదనే విషయం బహిరంగ రహస్యం. అధికారిక ప్రచారం కూడా మొదలుపెట్టడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది.
ఎన్టీఆర్-కొరటాల సినిమా కూడా అంతే. భారీ బడ్జెట్, జాన్వి కపూర్ హీరోయిన్, అనిరుధ్ మ్యూజిక్ లాంటివన్నీ వార్తల రూపంలో వస్తుంటాయి తప్ప, సినిమా మాత్రం ఈ ఏడాది రాదు. ఆ మాటకొస్తే, ఈ సినిమాకు ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేదు.
ఇలా ఎన్టీఆర్, చరణ్, బన్నీ ముగ్గురూ ఈ ఏడాదిని మిస్ అవుతున్నారు. కేవలం వీళ్ల సినిమా ఆప్ డేట్స్ మాత్రమే ఈ ఏడాది సందడి చేయబోతున్నాయి. ఇంకాస్త లోతుగా వెళ్తే, ఈ లిస్ట్ లోకి నాగార్జున, అడివి శేష్ లాంటి హీరోలు కూడా చేరేలా ఉన్నారు. కాకపోతే వీళ్లపై అప్పుడే ఓ అభిప్రాయానికి రాలేం.