ఏపీ అసెంబ్లీలో జగన్ చంద్రబాబు మీద మరో మారు విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏలుబడి మీద ఆయన హాట్ కామెంట్స్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట ఏపీలో భారీ స్కాం కి బాబు తెర తీశారు. ఈ మొత్తం కుంభకోణంలో ఆయనే మొదటి ముద్దాయని జగన్ ఆరోపించారు.
శాసనసభలో ప్రత్యేకంగా దీని మీద చర్చ ఎందుకు పెట్టామో కూడా జగన్ వివరించారు. బాబు హయాంలో స్కాం ఎలా జరిగింది అన్నది సభలో ఉన్న ఎమ్మెల్యేలకే కాదు, ఏపీలోని కోట్లాదిమంది ప్రజలకు తెలియాల్సి ఉందని జగన్ అన్నారు.
పైసా కూడా పెట్టుబడి పెట్టని సీమెన్స్ సంస్థకు 371 కోట్ల రూపాయలను బాబు ఎదురు ఇచ్చారని జగన్ విమర్శించారు. ఆ సంస్థ పేరు చెప్పి ఈ స్కాం కి బాబు తెర తీశారని జగన్ మండిపడ్డారు. మూడు వేల కోట్ల రూపాయలతో ఏపీ లో సీమెన్స్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ లో యువతకు శిక్షణ ఇస్తుందని చెప్పి చేసిందంతా కూడా స్కాం నే అని జగన్ దుయ్యబెట్టారు.
ఒక ప్రైవేట్ సంస్థ గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇంత పెద్ద మొత్తం ఇస్తుందా అన్న లాజిక్ కూడా లేకుండా బాబు మాత్రమే ఈ స్కాం చేయగలిగారు అని అన్నారు. ఒక్క పైసా కూడా ఆ సంస్థ పెట్టుబడి లేకుండా ప్రభుత్వమే 371 కోట్ల రూపాయలను ఇవ్వడం అంటేనే ఇది పక్కా స్కాం అని అర్ధం అవుతోందని జగన్ అన్నారు.
సీమెన్స్ సంస్థ కూడా అంతర్గత తనిఖీ చేసి తమ సంస్థలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ లాంటి స్కీంస్ ఏవీ లేవని తేల్చిందని జగన్ అన్నారు. జగన్ అన్న వ్యక్తి బటన్ నొక్కితే ఏపీలో పేద లబ్దిదారుల ఖాతాల్లోనికి నేరుగా నగదు బదిలీ అవుతుందని, అదే చంద్రబాబు బటన్ నొక్కితే ఆ నగదు అటూ ఇటూ తిరిగి ఏదో రూపంలో ఆయన ఖాతాలోకే వచ్చి చేరుతుందని జగన్ సెటైర్లు వేశారు.
ఇంత పెద్ద స్కాం చేసి యువత నోట్లో మట్టి కొడితే ఎల్లో మీడియా ఏమీ రాయదని, దత్తపుత్రుడు కూడా ఏమీ ప్రశ్నించకుండా మౌనం వహిస్తారు అని జగన్ దెప్పి పొడిచారు. చంద్రబాబు పాత్ర లేకుండా ఇంత పెద్ద స్కాం జరిగే అవకాశం లేదని ఆయన అంటున్నారు. దేశంలోనే ఇంతటి స్కాం వేరేది లేదని అందుకే ఈ సంగతి అందరికీ తెలియాలని జగన్ అన్నారు.
ఈ స్కాం లో ఒక్కోటి బయటకు వస్తున్నాయని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఇప్పటికే ఏపీ సీఐడీ విచారణ జరుపుతోంది. ఇపుడు ఈ విచారణ మరింత ముందుకు సాగవచ్చు అని అంటున్నారు. ఏపీలో రాజకీయం వేడెక్కిన వేళ పట్టభద్రుల ఎన్నికల్లో యూత్ ఓట్లు టీడీపీ కొల్లగొట్టిన వేళ అదే యూత్ ని స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అనాటి టీడీపీ ప్రభుత్వం ఎలా మోసం చేసింది అన్న దాని మీదనే జగన్ మాస్టర్ ప్లాన్ తోనే ఈ చర్చను అసెంబ్లీలో వచ్చేలా చూశారని అంటున్నారు.
యూత్ కి బాబు హయాంలో చేసిందేమీ లేదని చెప్పడమే వైసీపీ ఉద్దేశ్యమని అంటున్నారు. అంతే కాదు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి మోసం చేశారని,నిరుదోగ భృతి కూడా అయిదేళ్ళలో చివరి నాలుగు నెలలు ఇచ్చారని, అది సైతం తమ పార్టీ వారు కొందరికి ఇచ్చేసి మమ అనిపించారని వైసీపీ అంటోంది. యూత్ టీడీపీ వైపు మొగ్గు చూపడంతో టీడీపీ అయిదేళ్ల పాలన మీద నిరుద్యోగులకు ఆ పార్టీ ఏమి చేసింది అన్న దాని మీద వైసీపీ తన అస్త్రాలను బాయటకు తీసి మరీ ఎండగట్టాలని డిసైడ్ అయింది అని అంటున్నారు.