మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నాలుగేళ్ళ తర్వాత రీ యాక్టివ్ అవుతాను అని ఈ మధ్యనే చెప్పారు. లేటెస్ట్ గా టీడీపీకి దక్కిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయం లో తన పాత్ర ఉందని గంటా అనుచరులు అంటున్నారు.
గంటా విపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీలో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవనే అంటారు. ఇపుడు ఆయన టీడీపీలో బాగా చురుకుగా వ్యవహరిస్తున్న వేళ అసెంబ్లీలో ఆయన గొంతు అయితే పెద్దగా వినిపించడంలేదని అంటున్నారు.
తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గంటా చెప్పుకున్నారు. ఆయన గత ఏడాది రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి అసెంబ్లీకి వచ్చారు. ఈ మధ్యలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఆయన కనిపించలేదు. బడ్జెట్ సెషన్ లో సైతం గంటా వాయిస్ అయితే ఎక్కడా వినిపించడంలేదని అంటున్నారు.
అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన చంద్రబాబు ప్రకటనలు మాత్రం ఇస్తున్నారు. ఆయన ముందో తరువాతనో గంటా కూడా ప్రకటనలు ఇస్తూ ప్రజాస్వాయం ఖూనీ వైసీపీ అరాచకం అంటూ అందులోనే మండిపడుతున్నారు. గంటా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను ప్రస్థావిస్తే బాగుంటుందని అంటున్నారు. చంద్రబాబు మాదిరిగానే గంటా కూడా తాను మంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతాను అని అనధికార శపధం ఏదైనా చేశారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు.
ఇంతకీ గంటా అసెంబ్లీకి వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోతున్నారా లేక విపక్ష సభ్యునిగా ఈసారికి ఇలాగే కానీద్దామనుకున్నారో తెలియదు. కానీ గంటా మాత్రం రీ యాక్టివ్ అయ్యారు. ఆయన ప్రతీ రోజూ వైసీపీ ప్రభుత్వం మీద ఘాటైన తీరులో విమర్శలు చేస్తూ ప్రకటనలు అయితే గుప్పిస్తున్నారు అని అంటున్నారు. గంటా టీడీపీలో లక్షల్లో ఓకడు అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏ ఉద్దేశ్యంతో అన్నారు కానీ గంటా మాత్రం లక్షలలో ఒకడు కారు. ఆయన చంద్రబాబు సరిసాటి నాయకుడు అని ఆయన వ్యవహార శైలితో రుజువు చేసుకుంటున్నారు అంటున్నారు.