ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండోసారి ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న కవిత ఈడీ ఆఫీస్ నుండి బయటికొచ్చారు. కారులో కూర్చొని బీఆర్ఎస్ కార్యకర్తలకు విక్టరీ సింబల్ చూపిస్తూ.. ఈడీ ఆఫీస్ నుంచి తుగ్గక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు రామచంద్రన్ పిళ్లైతో కలిపి ఆమెను విచారించినట్లు తెలుస్తొంది.
కాగా ఇవాళ సాయంత్రం ఎస్కార్టు వాహనం, మహిళ వైద్య బృందం, తెలంగాణ అడిషనల్ ఏజీ సహా కవిత ప్రతినిధులు ఈడీ ఆఫీసుకు రావడంతో కవితను అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు కవిత ఈడీ ఆఫీసు నుండి బయటికి రావడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ రోజు విచారణ ముగిసిన నేపథ్యంలో, రేపు ఉదయం మరోసారి విచారణకు హాజరుకావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే విషయం కూడా తెలియదని కవిత చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 11న జరిగిన విచారణ సందర్భంగా కవిత తాను ఇచ్చిన వాంగ్మూలానికి కొనసాగింపుగానే, ఈ రోజు కూడా తన వాదన వినిపించినట్లు తెలుస్తోంది.
రేపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కూడా రేపు ఈడీ విచారించనుంది. దీంతో కవిత, శ్రీనివాసులురెడ్డిని కలిపి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవ అరెస్ట్ అయ్యారు.