జూ.ఎన్టీఆర్‌ను గెలికారు…న‌ష్ట‌మెవ‌రికంటే?

టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను గెలికారు. దీంతో న‌ష్ట‌మెవ‌రికి? అనే చ‌ర్చ మొద‌లైంది. బ్ర‌హ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు చివ‌రి క్ష‌ణంలో అనుమ‌తి ర‌ద్దు చేస్తూ తెలంగాణ పోలీస్ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.…

టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను గెలికారు. దీంతో న‌ష్ట‌మెవ‌రికి? అనే చ‌ర్చ మొద‌లైంది. బ్ర‌హ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు చివ‌రి క్ష‌ణంలో అనుమ‌తి ర‌ద్దు చేస్తూ తెలంగాణ పోలీస్ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. వినాయ‌క నిమ‌జ్జ‌నానికి బందోబ‌స్తులో నిమ‌గ్నం కావ‌డం వ‌ల్ల త‌గిన పోలీస్ ప్రొటెక్ష‌న్ క‌ల్పించ‌లేమ‌ని చేతులెత్తేశారు. దీన్ని జూనియ‌ర్ ఎన్టీఆర్ లైట్ తీసుకున్న‌ట్టు క‌నిపించినా, ఆయ‌న హ‌ర్ట్ అయ్యార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో బాగా న‌ష్ట‌పోయేది టీడీపీ, ల‌బ్ధి పొందేది బీజేపీ అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ కావ‌డం వ‌ల్ల సినిమా ఫంక్ష‌న్‌కు అనుమ‌తి ర‌ద్దు చేశార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. తెలంగాణ‌లో బీజేపీ అనుకూల వ్య‌క్తులంతా త‌మ‌కు వ్య‌తిరేకులుగానే టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వాయిదా వెనుక రాజ‌కీయ కార‌ణాలు లేవంటే న‌మ్మేదెవ‌రు?

దీన్ని బీజేపీ రాజ‌కీయంగా ఉప‌యోగించుకోనుంది. ఇదే సంద‌ర్భంలో బీజేపీకి జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు ఈ ఎపిసోడ్ దోహ‌దం చేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల అమిత్ షాతో భేటీ సంద‌ర్భంగా రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చారానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు కేసీఆర్ స‌ర్కార్‌కు ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందిన‌ట్టు తెలిసింది. అందుకే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయ‌డం ద్వారా, సినీ ఇండ‌స్ట్రీలో బీజేపీ వైపు పాజిటివ్‌గా ఉన్న వాళ్ల‌కు హెచ్చ‌రిక పంపాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇందులో భాగంగానే తాజా ప‌రిణామాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

జూనియ‌ర్ ఎన్టీఆర్ భ‌విష్య‌త్‌లో బీజేపీకి మ‌రింత చేరువ అయితే మాత్రం టీడీపీ త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయ మూలాల‌న్నీ ఏపీలో బ‌లంగా ఉన్నాయి. తెలంగాణ‌లో కంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయంగా బ‌ల‌మైన ప్ర‌భావం చూపే అవ‌కాశం వుంది. బ్ర‌హ్మాస్త్ర‌ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు ప‌ర్మీష‌న్ ర‌ద్దు చేయ‌డంతో జూనియ‌ర్ ఎన్టీఆర్‌లో స‌హ‌జంగానే క‌సి పెరుగుతుంది.

మ‌రీ ముఖ్యంగా త‌న‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తామ‌ని బీజేపీ ఆఫ‌ర్ ఇస్తుండ‌డంతో దాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు త‌గిన స‌మ‌యం కోసం ఆ యువ హీరో ఎదురు చూస్తున్నార‌ని స‌మాచారం. అదే జ‌రిగితే ఏపీలో టీడీపీకి నూక‌లు చెల్లిన‌ట్టే. కేసీఆర్ పుణ్య‌మా అని టీడీపీకి భ‌విష్య‌త్‌లో న‌ష్టం జ‌రిగే అవ‌కాశాలున్నాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ప్ర‌వేశానికి తాజా ఉదంతం బీజం వేసే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు బ‌లంగా న‌మ్ముతున్నాయి. అన్ని ప్ర‌శ్న‌ల‌కు కాలం జ‌వాబు చెప్పాల్సి వుంది.