Advertisement

Advertisement


Home > Movies - Movie News

కె.విశ్వనాధ్.. అన్నీ కళాత్మక ప్రయోగాలే

కె.విశ్వనాధ్.. అన్నీ కళాత్మక ప్రయోగాలే

కమర్షియల్ సినిమా ఎవరైనా తీస్తారు.. కళాత్మక సినిమా తీయడమే కష్టం. అలాంటి కష్టాన్ని ఎంతో ఇష్టంగా మార్చుకొని సినిమాలు తీసిన గొప్ప వ్యక్తి కె.విశ్వనాధ్. ఆయన తీసిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో అడుగడుగునా ప్రయోగాలే కనిపిస్తాయి. ఇలా కూడా సినిమాలు తీయొచ్చా, అప్పట్లోనే ఇంత సాహసం చేశారా, అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చింది లాంటి ఎన్నో సందేహాల మధ్య, ఇంకెంతో ఆశ్చర్యం కలుగుతుంది విశ్వనాధ్ సినిమాలు చూస్తే.

శంకరాభరణం.. కె.విశ్వనాధ్ కెరీర్ లోనే కాదు, తెలుగుసినీ చరిత్రలోనే ఆణిముత్యాల్లో ఒకటి. ఇలాంటి సినిమా తీయాలని ఎవ్వరూ అనుకోరు. అలా అనుకోవడమే మొదటి విజయం. తెలుగు సినిమాను మలుపుతిప్పిన ఈ చిత్రరాజం ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్ని అందుకుంది. నిజానికి ఇదొక పెద్ద ప్రయోగం. కథ నుంచి నటీనటుల ఎంపిక వరకు ప్రతి విషయంలో ప్రయోగం కనిపిస్తుంది.

ఈ సినిమాను ముందుగా శివాజీ గణేశన్ లేదా ఏఎన్నార్ తో తీయాలనుకున్నారు. అయితే వాళ్లను సంప్రదించలేదు. కృష్ణంరాజుతో తీయాలనుకొని, ఆయన్ను కలిసి కథ చెప్పారు. కథ విన్న కృష్ణంరాజు నిజాయితీగా తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇమేజ్ ఉన్న నటుడుతో శంకరశాస్త్రి పాత్రను వేయించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. 

అలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న జేవీ సోమయాజుల్ని తీసుకొచ్చి శంకరశాస్త్రి పాత్ర వేయించడం అతిపెద్ద సాహసం. అంతేకాదు.. అప్పటివరకు వ్యాంపు పాత్రలు వేసిన మంజుభార్గవితో కళాత్మక పాత్ర వేయించడం కూడా అతిపెద్ద సాహసమే. దీనిపై చాలా విమర్శలు చెలరేగినప్పటికీ విశ్వనాధ్ వెనక్కి తగ్గలేదు.

సాగర సంగమం విషయంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చాలానే జరిగాయి. అప్పటివరకు గ్లామర్ పాత్రలు చేసిన జయప్రదతో అలాంటి బాధాతప్త పాత్రను చేయించాలనుకోవడం పెద్ద సాహసం. దీనికితోడు ఆ సినిమాలో చాలా సన్నివేశాలు, అప్పటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా 'అవుట్ ఆఫ్ ది బాక్స్' ఆలోచనల కిందకొస్తాయి. షూటింగ్ దశలోనే కొన్ని సన్నివేశాలపై చాలా చర్చ జరిగినప్పటికీ ధైర్యం చేసి, అనుకున్నది అనుకున్నట్టుగా తీశారు విశ్వనాధ్. ఆ ధైర్యమే మరో విజయం.

ఇలా చెప్పుకుంటూ పోతే అప్పటికే మాస్-యాక్షన్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవిని స్వయంకృషిలో చెప్పులు కుట్టే వ్యక్తిగా చూపించడం.. స్టార్ హీరోయిన్ రాధికను స్వాతిముత్యంలో విధవగా చూపించడం, వెంకటేష్ ను స్వర్ణకమలంలో సాత్వికంగా చూపించడం లాంటివన్నీ విశ్వనాధ్ చేసిన ప్రయోగాల కిందకే వస్తాయి.

వీటన్నింటికంటే ముందు ఆయన ఎంచుకున్న కథలే అతిపెద్ద ప్రయోగాలు. మరో దర్శకుడు కలలో కూడా ఊహించలేని కథావస్తువులవి. కె.విశ్వనాధ్ మాత్రమే తీయగలిగే అపురూప కళాఖండాలవి. అందుకే ఆయన కళాతపస్వి అయ్యారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?