వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసలు తగ్గడం లేదు. తనకు అనుమానించిన చోట ఉండకూడదని భావించి వైసీపీ అధినాయకత్వంపై తిరుగుబాటు చేసిన కోటంరెడ్డిపై వైసీపీ నాయకులు ఒకొకరుగా బయటకు వచ్చి మాటల దాడి చేస్తున్నా నేపథ్యంలో ఇవాళ మీడియా సమావేశం పెట్టి వైసీపీ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేను జగన్ కు నమ్మకద్రోహం చేయలేదని, నన్ను అనుమానించిన పార్టీలో ఉండకూడదని భావించి నీతిగా, నిజాయితీగా పార్టీ అధికారంలో ఉన్నని తెలిసిన కూడా పార్టీ వదులుకున్నానని, అధికార పార్టీకి దూరం అయితే ఎన్ని ఇబ్బందులు వస్తాయే తెలుసని… నా మనసు విరిగింది కాబట్టే బయటకు వచ్చానన్నారు. ప్రాణతిప్రాణంగా ఆరాధించిన జగన్ ప్రభుత్వంలోనే నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందుకే ఇంకా పార్టీలో కొనసాగాలని అనుకోలేదన్నారు.
నన్ను ఆరెస్టు చేయబోతున్నట్లు లీకులు ఇస్తున్నారు.. నన్ను ఏ నిమిషమైనా అరెస్టు చేసుకోండి. జైల్లో పెట్టండి.. ఏమి చేసిన నా గొంతు ఆగే ప్రశ్నే లేదని.. నా గొంతు ఆగాలంటే ఎన్‌కౌంటర్ చేయించండి అంటూ సలహా ఇచ్చారు.
అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలపై కూడా కౌంటర్ ఇచ్చారు. అనిల్ వ్యాఖ్యలు బాధించాయని, గతంలో అనిల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే తన కుటుంబం బాధ పడిందని, తన కుటుంబం.. అనిల్ కుటుంబం వేరని ఎప్పుడూ అనుకోలేదని అలాంటిది అనిల్ తన కుటుంబంపై విమర్శలు చేయడం చూసి బాధించిందన్నారు. సీఎం జగన్ కు నమ్మక ద్రోహం చేయలేదని.. చేసి ఉంటే తనను సర్వనాశనం చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. తప్పు చేయకుండా ఉంటే దేవుడు అండగా ఉంటాడన్నారు.