సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ ఇల్లాలిగా మారింది. కొద్దిసేపటి కిందట ముంబయిలో కాజల్ పెళ్లి జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు, ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈరోజు ఉదయం నుంచి కాజల్ పెళ్లికి సంబంధించి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
35 ఏళ్ల కాజల్ పెళ్లిపై ఏడాదికి పైగా పెళ్లి పుకార్లు నడుస్తున్నాయి. ఎట్టకేలకు ఆ పుకార్లను నిజం చేస్తూ, తనకు కాబోయే భర్తను కొన్ని రోజుల కిందట బయటపెట్టింది కాజల్. ఈరోజు లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లాడింది.
కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకొని, అన్ని రకాల జాగ్రత్తల మధ్య కేవలం కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా ఈ పెళ్లి జరిగింది.
కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కు ఇదివరకే పెళ్లయింది. నిషాకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. నిషా పెళ్లి జరిగినప్పట్నుంచి కాజల్ పెళ్లిపై రూమర్లు వస్తున్నప్పటికీ.. చాలా గ్యాప్ ఇచ్చి ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది చందమామ.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగనుంది కాజల్. కొన్ని రోజులు మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేసి, ఆ తర్వాత ఆచార్య, ఇండియన్-2 సినిమాల్ని స్టార్ట్ చేస్తుంది కాజల్. త్వరలోనే గౌతమ్-కాజల్ జంట కొత్త ఇంటిలోకి షిఫ్ట్ అవ్వబోతోంది. తామిద్దరం కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వబోతున్నామని, కాజల్ కొద్దిరోజుల కిందట స్వయంగా ప్రకటించింది.