కల్కి కొచ్లిన్ కు సంబంధించి సమాధానం లేని ప్రశ్నలు 2 ఉన్నాయి. దాదాపు మూడేళ్లుగా అవి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. అందులో ఒక ప్రశ్న.. ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఈ హీరోయిన్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? ఇక రెండో ప్రశ్న.. ముంబయి వదిలి మరో ప్రాంతంలో ఎందుకు ఉంటోంది?
ఎట్టకేలకు ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పింది కల్కి. తనకు వివాహ వ్యవస్థపై నమ్మకం పోయిందని ప్రకటించింది ఈ బ్యూటీ. అనురాగ్ కశ్యప్ ను పెళ్లి చేసుకుంది కల్కి. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. అదే టైమ్ లో హ్యాష్ బర్గ్ కు దగ్గరైంది. అతడి ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది.
ఇదంతా మూడేళ్ల కిందటి ముచ్చట. పెళ్లి కాకుండానే తల్లి అయినందుకు అప్పట్లో అంతా ఆమెను ఆడిపోసుకున్నారు. ఇన్నాళ్లకు ఈ అంశంపై కల్కి కొచ్లిన్ స్పందించింది. విడాకులు తీసుకున్న తర్వాత వివాహ వ్యవస్థపై నమ్మకం పోయిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, తన బాయ్ ఫ్రెండ్ కు కూడా పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో.. సహజీవనంలోనే ఉండిపోయినట్టు వెల్లడించింది.
కల్కికి సంబంధించి మరో పెద్ద ప్రశ్న. ఆమె ముంబయిలో ఎందుకు ఉండడం లేదు? సాధారణంగా నటీనటులెవరైనా ముంబయిలోనే ఉంటారు. షూటింగ్స్ కు అందుబాటులో ఉంటారు. కానీ కల్కి మాత్రం ముంబయి వదిలి గోవాకు షిఫ్ట్ అయింది.
తన ప్రియుడిని తొలిసారిగా ఇజ్రాయెల్ లోని అందమైన పచ్చటి ప్రదేశంలో కలుసుకుందంట కల్కి. ఇద్దరికీ పచ్చదనం అంటే చాలా ఇష్టం అంట. దీంతో కూతుర్ని కూడా ప్రకృతి మధ్య పెంచేందుకు గోవాకు షిఫ్ట్ అయ్యామనే విషయాన్ని బయటపెట్టింది. ఇన్నాళ్లూ సమాధానం లేని ప్రశ్నలకు కల్కి ఇప్పుడు జవాబు చెప్పింది.