దేశవ్యాప్తంగా చాలా జంటలు సహజీవనం చేస్తున్నాయి. అయితే ఇది కాస్త వెరైటీ. ఓ మైనర్ బాలుడు, ఓ మేజర్ అమ్మాయి లివ్-ఇన్ లో ఉన్నారు. అబ్బాయికి 17 ఏళ్లు… అమ్మాయికి 19 ఏళ్లు.. ఇద్దరూ ప్రేమించుకోవడమే కాకుండా, ఏకంగా ఒకే ఫ్లాట్ లో సహజీవనం స్టార్ట్ చేశారు. ఇప్పుడీ అంశంపై కీలక ప్రకటన చేసింది అలహాబాద్ హైకోర్టు.
మైనర్లు సహజీవనం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది అలహాబాద్ హైకోర్టు. భాగస్వాముల్లో ఏ ఒక్కరు మైనర్ అయినా ఆ సంబంధం చెల్లదని తెలిపింది. సాధారణంగా సహజీవనానికి ఏ కోర్టు చట్టబద్ధత ఇవ్వదని, ఇలా మైనారిటీ తీరకుండానే లివ్-ఇన్ లో ఉంటే, అది అనైతిక చర్య మాత్రమే కాకుండా చట్టవిరుద్ధం అవుతుందని, ఇలాంటి సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా మరో కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించింది అలహాబాద్ హైకోర్టు. ఈ కేసులో మైనర్ బాలుడు ముస్లిం వర్గానికి చెందిన వాడు. అతడి మతానికి చెందిన ఆచారాల ప్రకారం కూడా లివ్-ఇన్ అనేది చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.
కోర్టు వరకు ఎందుకు వచ్చారు..?
ఇంతకీ ఈ జంట ఎందుకు కోర్టు మెట్లు ఎక్కిందో తెలుసా..? అలీ అబ్బాస్ (17), సలోనీ యాదవ్ (19) ప్రేమించుకున్నారు. కలిసి సహజీవనం మొదలుపెట్టారు. కానీ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం దీనికి అంగీకరించలేదు. అబ్బాయిపై కిడ్నాప్ కేసు పెట్టారు. తామిద్దరం సహజీవనంలో ఉన్నామని, తను ఇష్టపూర్వకంగానే అబ్బాస్ కోసం ఇంటిని వదిలి వచ్చేశానని యువతి కోర్టును అభ్యర్థించింది. ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరింది.
కేసు కోర్టుకు వచ్చిన తర్వాత అబ్బాస్ మైనర్ అని తేలింది. ఈ విషయాన్ని లాయర్ కూడా అంగీకరించాడు. దీంతో కోర్టు, అమ్మాయి వినతిని కొట్టి పారేసింది. అసలు ఓ మైనర్ తో సహజీవనం చేయడమే తప్పని తేల్చింది.
18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న నిందితుడు, తన కంటే వయసులో పెద్దదైన ఓ అమ్మాయితో లివ్-ఇన్ రిలేషన్ షిప్ కలిగి ఉన్నందున చట్టపరంగా రక్షణ పొందలేడని పేర్కొంది. తనపై మోపిన క్రిమినల్ అభియోగాల నుంచి తప్పించుకోలేడని స్పష్టం చేసింది.