సెంటిమెంట్ డేట్.. వదులుకోక తప్పని పరిస్థితి

మే 9.. వైజయంతీ మూవీస్ కు ఈ తేదీ ఎంత సెంటిమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాల కిందట ఇదే తేదీకి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చింది. అఖండ విజయం సాధించింది. కొన్నేళ్ల…

మే 9.. వైజయంతీ మూవీస్ కు ఈ తేదీ ఎంత సెంటిమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాల కిందట ఇదే తేదీకి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చింది. అఖండ విజయం సాధించింది. కొన్నేళ్ల కిందట ఇదే తేదీకి మహానటి వచ్చింది. సంచలనం సృష్టించింది. అందుకే ఇదే తేదీకి కల్కి విడుదల చేయాలని నిర్ణయించాడు నిర్మాత అశ్వనీదత్.

ఓవైపు సినిమాపై ఎన్ని అనుమానాలున్నా, ఊహాగానాలు చెలరేగుతున్నా…. విడుదల తేదీపై మాత్రం ఎవ్వరూ డౌట్స్ పెట్టుకోలేదంటే దానికి కారణం ఈ సెంటిమెంట్. అలాంటి సెంటిమెంట్ తేదీని ఇప్పుడు వదులుకోవాల్సి వస్తోంది.

ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీని మే 13న ఫిక్స్ చేసింది ఎన్నికల సంఘం. ఏపీ, తెలంగాణలో లోక్ సభ స్థానాలకు ఆ రోజున పోలింగ్ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు.

ఎన్నికల ఫీవర్ ఆల్రెడీ మొదలైంది. ఆ టైమ్ కు పీక్ స్టేజ్ కు చేరుకుంటుంది. పైగా కల్కి సినిమా పాన్ ఇండియా మూవీ. 7 దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే సమయం. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో కల్కి సినిమాను విడుదల చేయలేని పరిస్థితి.

మార్చి 20 నుంచి ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీ వరకు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల హంగామా ఉంటుంది. ఫలితాలు వెలువడిన తర్వాత కూడా సందడి ఉంటుంది. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరడం, మంత్రివర్గ ఏర్పాటు లాంటివి ఉంటాయి. కాబట్టి జూన్ మొదటివారం వరకు కల్కి సినిమాను విడుదల చేయలేరు. ఈ సినిమా ఇప్పటికే ఓసారి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా అనివార్యమైంది.