బీసీ మహిళలు వ‌ర్సెస్ బాల‌య్య, లోకేష్

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ ఒక ఎంపీ స్ధానం త‌ప్ప తమ అభ్యర్థులను మొత్తం ప్రకటించేసింది. టీడీపీ కూటమి నుండి కూడా దాదాపు అన్ని స్థానాల్లోనూ అభ్యర్థుల ప్రకటన…

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ ఒక ఎంపీ స్ధానం త‌ప్ప తమ అభ్యర్థులను మొత్తం ప్రకటించేసింది. టీడీపీ కూటమి నుండి కూడా దాదాపు అన్ని స్థానాల్లోనూ అభ్యర్థుల ప్రకటన కొలికి వచ్చేసింది. దీంతో రాష్ట్రం మొత్తం ఇప్పుడు టీడీపీలోని అగ్ర నాయకులు అయిన‌ మామా అల్లుడు అయిన నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ నియోజకవర్గాల వైపు దృష్టి మళ్లింది. ఎందుకంటే వీరికి పోటీగా వైసీపీ బీసీ మ‌హిళా అస్త్రాన్ని ప్ర‌యోగిస్తోంది.

మంగ‌ళ‌గిరిలో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి త‌న తండ్రి చంద్ర‌బాబుకు గిప్ట్‌గా ఇవ్వ‌లాని ప్ర‌య‌త్నిస్తున్న నారా లోకేశ్‌పై మురుగుడు లావ‌ణ్య‌ను బ‌రిలో నిలిపింది. లావ‌ణ్య అత్తింటి, మెట్టినింటి కుటుంబాలకు బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్యం వుంది. అంతేకాదు, మంగ‌ళ‌గిరిలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గమైన చేనేత‌ల్లో లావ‌ణ్య‌కు మంచి ప‌ట్టు వుంది. మ‌రోవైపు మంగ‌ళ‌గిరి టీడీపీ కంచుకోట కాదు. క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట్లు కూడా పెద్ద‌గా లేవు. కేవ‌లం చంద్ర‌బాబును న‌మ్మి ఓట్లు వేస్తే లోకేష్ గెలిచే అవ‌కాశం ఉంటుంది. రెండోసారి కూడా లోకేశ్ ఓడిపోతే, ఇక ఆయ‌న రాజ‌కీయ జీవితం ముగిసిన‌ట్టే.

మ‌రోవైపు హిందూపురంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలన్న లక్ష్యంతో ఉన్న నంద‌మూరి బాలకృష్ణకు చెక్‌ పెట్టేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా మహిళా ప్లస్‌ బీసీ కార్డ్‌ను ఉప‌యోగిస్తోంది. హిందూపురం అసెంబ్లీ ప‌రిధిలో కురుబ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన దీపిక అనే మ‌హిళ‌ను రంగంలోకి దింపారు. దీనితో పాటు హిందూపురంలో వైసీపీ గెలుపు బాధ్య‌త‌ల‌ను మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్ర రెడ్డికి అప్ప‌గించారు. దీంతో ఇక్క‌డ‌ క‌మ్మ వ‌ర్సెస్ కుర‌బ ల మ‌ధ్య ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంతో బాల‌కృష్ణ గెలుపు అంత ఈజీ అయ్యే అవ‌కాశం లేదు. దీనితో పాటు బీజేపీతో పొత్తు వ‌ల్ల ముస్లిం ఓట్లు కూడా టీడీపీకి దూరం అయ్యే అవ‌కాశం ఉంది.

ఇప్పుడు మంగ‌ళ‌గిరి, హిందూపురంలో క‌మ్మ వ‌ర్సెస్ బీసీల మ‌ధ్య పోటీతో పాటు టీడీపీ ఆగ్ర నాయ‌కులు ఇద్ద‌రు మ‌హిళ నేత‌ల‌తో పోటీ ప‌డుతుండ‌టంతో వారి గెలుపోటములపై పెద్ద ఎత్తున్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. టీడీపీ ఆగ్ర నాయ‌కుల‌ను ఓడించి చ‌రిత్ర సృష్టిస్తారా లేదా అనేది మ‌రి కొన్ని రోజుల్లో తెలుస్తుంది.