సినిమాలకు యుఎస్, కెనడా బిజినెస్ మంచి ఆదాయ వనరు. కొంతమంది హీరోలకు, దర్శకులకు అమెరికాలో మంచి ఫ్యాన్ బేస్ వుంది. సరైన సినిమా పడితే మిలియన్లు కురుస్తాయి. ఒకప్పుడు యుఎస్ సినిమా అంటే క్లాస్. త్రివిక్రమ్, మహేష్ బాబు ఇలా కొంత మందికే మార్కెట్ వుండేది. కానీ ఇప్పుడు మారిపోయింది. మన కుర్రాళ్లు లక్షల మంది అక్కడికి చేరిపోయి, మాస్ సినిమాలకు మహారాజ పోషకులుగా మారిపోయారు. ఈ సినిమా ఆ సినిమా అని లేదు. బాగుంటే చాలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు.
కల్కి సినిమా విడుదలకు రెండు వారాల ముందే ఒకటిన్నర మిలియన్ల అడ్వాన్స్ బుకింగ్ లు అందుకుంది. అంటే ఆ సినిమా రేంజ్ ఎలా వుండబోతోందో అర్ధం అవుతుంది. ఈ రేంజ్ ను మరింత పెంచేందుకు ఓ ప్లాన్ వేసారు కల్కి నిర్మాతలు. కెనడా వైపు పంజాబీలు ఎక్కువగా వున్నారు. ఇటీవల యానిమల్ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ కావడానికి కారణం ఆ కథ పంజాబీ కుటుంబం నేపథ్యంలో నడవడం వల్లనే అనే అభిప్రాయం ఒకటి వుంది.
ప్రభాస్ కు కూడా నార్త్ బెల్ట్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. పైగా కల్కి సినిమా అమితాబ్, దీపిక లాంటి హిందీ తారాగణంతో తయారవుతోంది. దీనికి కాస్త పంజాబీ టచ్ వుంటే బాగుంటుందని నిర్మాతలు ఆలోచించి, ఇటీవల జస్ట్ ఒకటి రెండు రోజుల ముందు ఓ పంజాబీ బీట్ సాంగ్ ను ప్లాన్ చేసారు. దీన్ని ఫేమస్ పంజాబీ సింగర్ దిల్ జిత్ చేత పాడించారు.
ఈ పాట కేవలం పంజాబీ ప్రేక్షకులను టార్గెట్ చేసి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అది కూడా ముఖ్యంగా యుఎస్/కెనడా ప్రేక్షకుల కోసం ప్లాన్ చేసారు.