కంగ‌నా స‌వాల్

వివాదాస్ప‌ద బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ స్వాతంత్ర్యంపై చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. త‌న వ్యాఖ్య‌ల‌పై ఆమె వెన‌క్కి త‌గ్గ‌క‌పోగా… స‌వాల్ విసురుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.  Advertisement భార‌త్‌కు నిజ‌మైన స్వాతంత్ర్యం 2014లో…

వివాదాస్ప‌ద బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ స్వాతంత్ర్యంపై చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. త‌న వ్యాఖ్య‌ల‌పై ఆమె వెన‌క్కి త‌గ్గ‌క‌పోగా… స‌వాల్ విసురుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

భార‌త్‌కు నిజ‌మైన స్వాతంత్ర్యం 2014లో వ‌చ్చింద‌ని, 1947లో వ‌చ్చింది భిక్ష మాత్ర‌మేన‌ని ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ దఫా ఆమె మ‌హాత్మ‌గాంధీజీని ప్ర‌శ్నిస్తుండడం విశేషం. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌ను, నాటి పోరాటాల్ని అవ‌మానించేలా వ్యాఖ్యానించిన కంగ‌నాను వెంట‌నే అరెస్ట్ చేయాల‌నే డిమాండ్లు దేశ వ్యాప్తంగా వెల్లువెత్తు తున్నాయి.

కానీ ఆమె మాత్రం త‌న వ్యాఖ్య‌ల‌పై ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేయ‌క‌పోగా, త‌న‌ను నిల‌దీస్తున్న వాళ్ల‌కు స‌వాల్ విసిరారు. త‌న వ్యాఖ్య‌లు త‌ప్ప‌ని నిరూపిస్తే ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానంటూ స‌వాల్ విసిరారు. ఈ మేర‌కు ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చారు.

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘జస్ట్‌ టు సెట్‌ ది రికార్డ్స్‌ స్ట్రేట్‌’ అనే పుస్తకంలోని పేజీలను కంగ‌నా శ‌నివారం షేర్‌ చేస్తూ… ‘రాణీ లక్ష్మీబాయి జీవిత చరిత్రపై తీసిన సినిమాలో నేను నటించాను. అందుకోసం 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య పోరాటంపై లోతైన‌ పరిశోధన చేశాను. అప్పుడు జాతీయవాదం పెరిగింది. కానీ ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయింది? భగత్‌సింగ్‌, నేతాజీ బోస్‌ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వారికి గాంధీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు?

ఎందుకు విభజన రేఖను తెల్లవ్యక్తి గీయాల్సి వచ్చింది? స్వాతంత్ర్యాన్ని వేడుక చేసుకోవాల్సింది మాని.. ఎందుకు భారతీయులు ప‌ర‌స్ప‌రం చంపుకొన్నారు? ఈ ప్రశ్నలకు నేను సమాధానం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. 1857లో జరిగిన యుద్ధం గురించి నాకు తెలుసు.  కానీ 1947లో ఏం జరిగింది. దీని గురించి ఎవరైనా నాకు హితబోధ చేస్తే తప్పకుండా నా పద్మశ్రీని వెనక్కి ఇచ్చి.. అందరికీ క్షమాపణ చెబుతాను’  అని కంగనా త‌న మార్క్ రాత‌ల‌ను ఆవిష్క‌రించారు. ఇంకా ఆమె ఏమ‌న్నారంటే…

‘భౌతికంగా మనకు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చింది. కానీ భారతీయుల మనస్సాక్షికి మాత్రం 2014లో స్వేచ్ఛ లభించిందని నేను ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాను. 2014లో మన నాగరికతకు మళ్లీ జీవం వచ్చి రెక్కలు చాచి ఎగురుతోంది. కేవలం ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌లను వైరల్‌ చేసి విమర్శలు చేయడం కాదు.. మొత్తం ఎపిసోడ్‌ చూపించి మాట్లాడండి. నిజాలు మాట్లాడేం దుకు, వాటి పరిణామాలను ఎదుర్కొనేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఆ ఇంటర్వ్యూలో నేను అమరవీరులను అవమానించినట్లు ఎవరైనా నిరూపిస్తే నా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తాను’ అని త‌న‌ను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్న వాళ్ల‌కు కంగనా ర‌నౌత్ స‌వాల్ విసిరారు.

కంగ‌నా రాత‌ల వెనుక బీజేపీ ఉంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే గాంధీజీ విశ్వ‌స‌నీయ‌త‌తో పాటు త్యాగాన్ని కూడా ప్ర‌శ్నిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు అంటున్నాయి. ఆమె వెనుక బీజేపీ లేకుండే… వెంట‌నే అరెస్ట్ చేయాల‌నే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం ఎలా స‌మ‌సిపోతుందో చూడాల్సిందే.