రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో రగడ జరుగుతోంది. ఓవైపు ప్రభుత్వం, విద్యాసంస్థల స్వాధీనం కంపల్సరీ కాదంటోంది, మరోవైపు విద్యార్థి లోకం లాఠీ దెబ్బలు తింటోంది. జగన్ మౌనం దీనికి పరిష్కారం కాదు. విద్యార్థులపై విరిగిన లాఠీలకు కచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. పరిస్థితి అంతదూరం రాకముందే మేలుకోవడం మంచిది.
అమరావతి రైతుల వెనక టీడీపీ వాళ్లున్నారని అంటున్నారు సరే, మరి విద్యార్థుల వెనక ఎవరున్నారు. పోనీ ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయనే అనుకుందాం. విద్యార్థులు అనవసరంగా లాఠీ దెబ్బలు తింటున్నారని చెప్పుకుందాం. ప్రభుత్వం ఓ మెట్టు కిందకి దిగి సమస్య పరిష్కరిస్తే విద్యార్థిలోకం రోడ్డెక్కే పరిస్థితే రాదు కదా. అంత మాత్రం దానికి మొహమాటం ఎందుకు.
మొన్న అనంతపురంలో విద్యార్థులపై లాఠీ విరిగింది. అబ్బెబ్బే అదేం లేదని యాజమాన్యం అందర్నీ పిలిపించి మాట్లాడింది సర్ది చెప్పి పంపించింది. ఈలోగా ప్రతిపక్షాలు చేయాల్సిన రాద్ధాంతం అంతా చేసేశాయి. తాజాగా కాకినాడలో ఐడీఎల్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
కలెక్టరేట్ ముట్టడిస్తే పోలీసులు ఊరుకోరు కదా, లాఠీకి పనిచెప్పారు. ఇంకేముంది ప్రతిపక్షాలు దీన్ని హైలెట్ చేశాయి, వారి అనుకూల మీడియా పదే పదే విద్యార్థులను కొట్టే వీడియోలను చూపిస్తోంది. దీనివల్ల ఎవరికి నష్టం, ఎంత నష్టం. ప్రతిదానికి ప్రతిపక్షాలను తిడుకూ కూర్చుంటే ఆ తర్వాత జరిగేదానికి బాధ్యులెవరు..?
ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందనే విషయం చాన్నాళ్ల క్రితమే అర్థమైపోయింది. జీవోని వెనక్కి తీసుకోడానికి మొహమాట పడుతున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చామంటూ, తుది నిర్ణయం వాళ్లదే అంటూ కవర్ చేసుకోలేక సతమతం అవుతున్నారు.
పోనీ మధ్యేమార్గంగా విద్యార్థులతో మాట్లాడి, వారిని ఒప్పించి, ఆ తర్వాత తల్లిదండ్రులతో చర్చించి కాలేజీలు మార్పించే విషయంలో నిర్ణయం తీసుకొవచ్చు కదా. కేవలం యాజమాన్యాలనే ఈ విషయంలో కీలకం చేయడంతోనే అసలు సమస్య మొదలైంది.
లాఠీ దెబ్బలకు సమాధానం ఎవరు చెబుతారు..?
రెచ్చగొట్టి వదిలేయడం సహజంగా ప్రతిపక్షాలు చేసే పనే. అయితే అలా రెచ్చగొట్టినా, వారికి తత్వం బోధపడితే వారి ఉచ్చులో పడకుండా ఉంటారు ప్రజలు. ప్రభుత్వం తమ మంచికే చేస్తుందనే భరోసాతో ఉంటారు. సహకరిస్తారు, కొన్నాళ్లు ఇబ్బందులున్నా సర్దుకుపోతారు. ఆమాత్రం అర్థం అయ్యేలా చెప్పడం అటు అధికారులకు చేతకావడంలేదు, ఇటు నాయకులకు వీలు కావడంలేదు.
పిల్లలపై లాఠీ విరగడం ఎవరికీ క్షేమకరం కాదు. ఎవరూ సమర్థించే విషయం కాదు. ఇప్పుడిక జగన్ స్పందించాల్సిన సమయం వచ్చింది. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన టైమ్ దగ్గరపడింది.