సినిమాల్లో సాధించే విజయాలు అద్భుతాలు కంటే రాజకీయపరమైన వ్యాఖ్యలు విమర్శలతో సదా వార్తల్లో ఉండే హీరోయిన్ కంగనా రనౌత్. బాలీవుడ్ నుంచి భారతీయ జనతా పార్టీకి అప్రకటిత బ్రాండ్ అంబాసిడర్ లాగా వ్యవహరిస్తూ ఉండే కంగనా.. తాజాగా రాజమౌళిని వెనకేసుకొస్తున్నారు. ఆస్కార్ అవార్డులు పొండానికి చేస్తున్న ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి.. అమెరికాలో పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే.. హిందూ మతం, హిందూత్వం తదితర అంశాల గురించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్తా వివాదాస్పదం అయ్యాయి. అయితే ప్రస్తుతం ఆయన కు అండగా.. వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ గళం విప్పుతున్నారు.
ఇంతకూ రాజమౌళి ఏమన్నారంటే.. హిందూమతం వేరు, హిందూ ధర్మం వేరు. మతం విషయానికి వస్తే నేను అసలు హిందువునే కాదు. కానీ హిందూ ధర్మం నాపై చాలా ప్రభావం చూపింది. స్ఫూర్తి అందించింది.. లాంటి డైలాగులను రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ వివాదాస్పదం అయింది. నెటిజన్లు చాలా సహజంగానే రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ ను జాతీయవాద చిత్రంగా ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు అనుకూలంగా ఈ చిత్రం చేశారనే పేరు వచ్చింది. ఇంటర్వ్యూలో కూడా అదే ప్రశ్న అడిగారు. ఈ చిత్రం రూపొందించడం వెనుక బిజెపినుంచి గానీ, ఆరెస్సెస్ నుంచి గానీ ఏమైనా ఒత్తిడి ఉందా అని అడిగారు. దానికి సమాధానంగా రాజమౌళి తన సినిమాలను ఇప్పటిదాకా ఎవరూ ఇన్ ఫ్లుయెన్స్ చేయలేదని అంటూ.. చెప్పిన సుదీర్ఘ సమాధానంలో అనేక విషయాలు దొర్లాయి. అవే వివాదాంశాలు అయ్యాయి.
రాజమౌళి మాటలు ఆయనపై ఎంతగా బిజెపి బ్రాండ్ వేశాయో లేదో తెలియదు గానీ.. ఇప్పుడు ఆయనను సమర్థించడానికి, ఆయనకు అండగా నిలవడానికి, ఆయన తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ముందుకు రావడంతో ఆ పని జరుగుతోంది. కంగనా రనౌత్ సమర్థించింది అంటే చాలు.. రాజమౌళికి కాషాయీకరణ జరిగినట్టే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
‘‘రాజమౌళిని ఎందుకు విమర్శిస్తున్నారు. ఆయన అంతర్జాతీయ వేదికల రెడ్ కార్పెట్ మీద ధోవతితో వెళ్లినందుకా, బాహుబలితో మన ప్రాచీన సంస్కృతిని చూపించినందుకా, ఆర్ఆర్ఆర్ తో జాతీయవాద చిత్రం తీసినందుకా’’ అంటూ కంగనా రెచ్చిపోయారు. ఆమె డిఫెన్సు.. రాజమౌళిని బిజెపి ప్రేమికులకు మరింత సన్నిహితుణ్ని చేసేసింది.
అయినా రాజమౌళి ఇప్పుడు కాషాయీకరణ కావడం అంటూ ఏమీ లేదని, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను బిజెపి ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసినప్పడే ఆ పర్వం పూర్తయిందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమా విడుదలైన కాడినుంచీ.. హిందూత్వ ఎజెండాతో తీసిన సినిమాగా ముద్రపడిన ఆర్ఆర్ఆర్ గురించి.. ముందుముందు ఇంకా ఎన్ని విమర్శలు చూడాలో ఏమో?