భారతీయ జనతా పార్టీకి తాజాగా రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణకు, జనసేన ని పవన్ కళ్యాణ్ తో చెప్పుకోదగినంత అనుబంధమే ఉంది! ఆయన రాజీనామాకు కొన్ని వారాల ముందు, జనసేనలో నెంబర్ టూ అనదగిన నాదెండ్ల మనోహర్ స్వయంగా కన్నా ఇంటికి వెళ్లడం, సుదీర్ఘమంతనాలు సాగించడం గమనించిన ఎవరికైనా సరే ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారనే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
తాను ఏ పార్టీలో చేరేది ఆయన ఇంకా బహిరంగపరచకపోయినప్పటికీ, కన్నా శత్రువులు అయిన రాయపాటి సాంబశివరావు లాంటి వారిలో పుడుతున్న కంగారును బట్టి.. అదే నిజమేమో అనిపిస్తుంది. అయితే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడం అనేది పూర్తిగా పవన్ కళ్యాణ్ స్కెచ్ మేరకే, గైడెన్స్ మేరకే జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రకరకాల రాజకీయ సమీకరణలను లెక్క వేసి, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా కన్నాను తెలుగుదేశం వైపు పంపుతున్నారనేది విశ్వసనీయ సమాచారం. ఒక రకంగా చూసినప్పుడు ఈ గుసగుసలు చాలా సహేతుకంగా అనిపిస్తాయి.
కన్నా లక్ష్మీనారాయణకు పవన్ కళ్యాణ్ తో అనుబంధం ఉన్నది కానీ, ఆయన జనసేనలో చేరితే, ఆ పార్టీకి ఇప్పటికే ఉన్న కాపు ముద్ర మరింతగా బలపడుతుంది. కాపులందరూ ఒక గూటికి చేరుతున్నారని విమర్శలు వస్తాయి. కాపు కులాన్ని తప్ప మరొకరిని ఆకర్షించలేని నాయకుడిగా పవన్ కళ్యాణ్ కు అపకీర్తి దక్కుతుంది. పైగా ఎన్నికల తరువాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తే.. జనసేన వాటాకు వచ్చే మంత్రి పదవులలో ఒకటి కన్నా లక్ష్మీనారాయణ ఎగరేసుకు పోతారు. ఈ కష్టాలన్నీ ఎందుకని.. ఆయనను తెలుగుదేశంలోనే చేరాల్సిందిగా పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. కావలిస్తే ఆయన తరఫున ప్రచారానికి తాను శ్రద్ధగా వస్తానని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకరకంగా కన్నాను తన తరఫు ప్లాంటర్ గా పవన్ కళ్యాణ్ తెలుగుదేశంలోకి పంపుతున్నారన్నమాట.
నిజానికి ఇది చంద్రబాబు నేర్పిన విద్య అని విశ్లేషకులు అంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో, హీరో పవన్ కళ్యాణ్ కు ఎంతో సన్నిహితుడైన కామినేని శ్రీనివాసరావు రాజకీయాల్లో చేరాలనే ఉత్సాహంతో ముందుకు వచ్చారు. పవన్ కు ఆయన ఎంతో సన్నిహితులు. అలాగని జనసేన ఆ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. అందుకని, తెలుగుదేశంలో చేరాల్సిందిగా పవన్ సిఫారసు చేస్తే.. వద్దు బిజెపిలో చేరమంటూ చంద్రబాబు నాయుడు తన చాతుర్యం ప్రదర్శించినట్లు చెప్పుకుంటారు.
చంద్రబాబు గైడెన్స్ మేరకు బిజెపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కామినేనికి, ఆయన మంత్రి పదవి కట్టబెట్టి తాను చేయగలిగిన మేలు చేశారు. ఇప్పుడు అదే డొంక తిరుగుడు సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ కూడా అమలు చేస్తున్నారు. తనకు కావలసిన వ్యక్తి అయినప్పటికీ కన్నా లక్ష్మీనారాయణను తెలుగుదేశం వైపు నడుతున్నారు అని పలువురు భావిస్తున్నారు.