Advertisement

Advertisement


Home > Movies - Movie News

కన్నడ చిత్రసీమకు తెలుగు సినిమాలతో కొత్త సమస్య!

కన్నడ చిత్రసీమకు తెలుగు సినిమాలతో కొత్త సమస్య!

కన్నడ చిత్రసీమ శాండల్‌ వుడ్‌కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. అదే డబ్బింగులపై నిషేధం ఎత్తిపోవడం. దశాబ్దాలుగా కన్నడీగులు ఇతర భాషల సినిమాలు అనువాదం అయ్యి తమ ఇండస్ట్రీ మీదకు రాకుండా చూసుకున్నారు. వాస్తవానికి అయితే అలా డబ్బింగులను నిషేధించే హక్కు ఎవరికీ లేదు. ఎవరు ఏ సినిమాను ఏ భాషలోకి అయినా డబ్బింగ్‌ చేసుకోవచ్చు. చట్టపరంగా ఆ అడ్డంకులు ఉండవు. అయితే కన్నడ చిత్ర పరిశ్రమ ముఖ్యులు తమ సినిమాలను కాపాడుకునేందుకు డబ్బింగులపై నిషేధం విధించారు. అది అనధికార నిషేధమే. అలా ఇతర భాషల నుంచి అనువాదాలు కాకుండా చూసి తమ సినిమాలను మార్కెట్‌ చేసుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు మొదటి నుంచి కన్నడనాట విపరీతమైన ఆదరణ ఉంది.

అవి కనుక కన్నడలోకి డబ్‌ అయ్యి రిలీజ్‌ అయితే శాండల్‌ వుడ్‌ హీరోలకు పని ఉండదు. పూర్తిగా ఆ భాషల సినిమాలే కన్నడ రాజ్యాన్ని ఏలేస్తాయి. అందుకే వాటి డబ్బింగ్‌ను నిషేధించారు. అయినా ఇతర భాషల సినిమాలను కన్నడీగులు కంట్రోల్‌ చేయలేకపోయారు. దీనికి ప్రధానమైన కారణం.. కర్ణాటక భౌగోళిక, సామాజిక పరిస్థితులు! మరి సినీ పరిశ్రమ విస్తృతికీ భౌగోళిక, సామాజిక పరిస్థితిలకు సంబంధం ఉంటుందా? అంటే ఉంటుందనే చెప్పాలి. కర్ణాటకలో సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాల భాషల ప్రభావం ఆ రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. రాయలసీమలోని మూడు జిల్లాలు కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటాయి. అనంతపురం, కర్నూలు, చిత్తూరు. సరిహద్దుల్లోని ఈ జిల్లాలపై కర్ణాటక ప్రభావం ఎలా ఉన్నా.. ఈ జిల్లాల ప్రభావం కర్ణాటక మీద చాలా ఎక్కువ!

బెంగళూరులో ఏ మూలకు వెళ్లినా కొత్తగా కర్ణాటకకు వెళ్లిన వాళ్లో.. దశాబ్దాల కిందట అక్కడకు వెళ్లి సెటిలైన వాళ్లో.. అక్కడే వ్యవసాయం చేసుకొంటూ బతికి ఇప్పుడు మెట్రో నగరంలో భూ స్వాములుగా ఉన్న వాళ్లో కనిపిస్తారు. అధికారిక భాష కన్నడే అయినా.. తెలుగుది అనధికార డామినేషన్‌. మరోవైపు తమిళులు.. బెంగళూరుకు కూతవేటు దూరంలో తమిళనాడు సరిహద్దు ఉంది. భాషాభిమానం మెండుగా ఉండే తమిళులూ బెంగళూరును ఓన్‌ చేసుకున్నారు. ఇలా తెలుగువాళ్లు, తమిళులు కలిసి.. స్థానికులకు తమ తమ భాషలు నేర్పించేశారు! తమ సినిమా రుచులను కూడా చూపించేశారు.

తెలుగు, తమిళ, హిందీ సినిమాలు ఆయా భాషల్లోనే  విడుదల అయిపోయి సొమ్ము చేసుకుంటూ సాగాయి. కన్నడలోకి అనువాదం కాకపోయినా.. అక్కడి సినిమాలకు మించిన స్థాయి కలెక్షన్లను సంపాదించుకుంటూ వచ్చాయి. ప్రతివారం తెలుగు సినిమాలో కర్ణాటకలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో భారీఎత్తున విడుదల అవుతూ వస్తున్నాయి. భారీ కలెక్షన్లను సంపాదించుకుంటూ వచ్చాయి. అలా అనువాదాలను కట్టడి చేసినా తెలుగుతో పాటు ఇతర సినిమాల హవాకు అడ్డులేకుండా పోయింది.

అయితే ఇప్పుడు అనువాదాలపై ఇన్నేళ్లూ ఉండిన అనధికారిక నిషేధం కూడా తొలగిపోయింది. కొన్నినెలల నుంచి అనేక సినిమాలు కన్నడలోకి అనువాదం అయ్యి విడుదల అవుతున్నాయి.  అజిత్‌ సినిమా 'వివేకం' నుంచి ఇది మొదలైంది. ఆ తమిళ సినిమాను కన్నడలోకి అనువదించి విడుదల చేశారు. కొన్ని కన్నడ సంఘాలు ఆ విషయంలో అభ్యంతరం చెప్పినా.. ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత హాలీవుడ్‌ సినిమాలు కన్నడలోకి అనువాదం అయ్యాయి, ఆపై ఇప్పుడు తెలుగు, తమిళ సినిమాల డబ్బింగ్‌ ఊపు పెరిగింది. విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌', ఇప్పుడు 'సైరా నరసింహారెడ్డి' సినిమాలు కన్నడలోకి అనువాదం అయ్యాయి. తెలుగుతో పాటు విడుదల అయ్యాయి.

ఆల్రెడీ ఈ సినిమాల ఒరిజినల్‌ తెలుగు వెర్షన్లు రొటీన్‌గా విడుదల అయ్యాయి. వాటితో పాటు కన్నడ అనువాదాలు కూడా విడుదల అయ్యాయి. 'సైరా నరసింహారెడ్డి' సినిమాను మల్టీఫ్లెక్స్‌లలో రోజుకు ఐదారు ఆటలు ఆడించారు బెంగళూరులో. అదే రోజున సైరా కన్నడ వెర్షన్‌ను కూడా ఒక ఆట ఆడించారు! ప్యూర్‌ కన్నడ ప్రేక్షకులను కూడా అలా థియేటర్లకు రప్పించుకున్నారు.  అనువాదంతో ఈ సినిమాలకు అక్కడ మార్కెట్‌ మరింత పెరిగింది.

ఈ సినిమాలకు అయితే మార్కెట్‌ పెరిగింది కానీ.. ఒరిజినల్‌ కన్నడ సినిమాలకు మాత్రం మరింత కష్టకాలం దాపురించింది. తెలుగు, తమిళ, హాలీవుడ్‌, హిందీ సినిమాలు ఇప్పుడు కన్నడలోకి అనువాదం అయ్యి విడుదల కావడంతో.. ఇన్నాళ్లూ ఈ భాషల సినిమాలు అర్థంకావని వీటికి వెళ్లనివారు కూడా, ఇక నుంచి వెళ్లే అవకాశం ఉంది. తమ భాషలోనే ఇప్పుడు పరాయి భాషల సినిమాలను చూసే అవకాశం వచ్చింది వాళ్లకు. దశాబ్దాలుగా ఈ అవకాశం లేదు. ఇప్పుడు వచ్చింది.

దీంతో కన్నడ చిత్ర పరిశ్రమకు మరిన్ని ఇక్కట్లు మొదలైనట్టుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇన్నాళ్లూ కన్నడ హీరోలు తమ బండిని చాలావరకూ రీమేక్‌ సినిమాలతో లాగించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హిట్టైన బోలెడన్ని సినిమాలను వారు రీమేక్‌ చేస్తూ వచ్చారు. ఎంతలా అంటే.. సంవత్సరానికి కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వంద సినిమాలు వస్తున్నాయనుకుంటే.. అందులో యాభై సినిమాల వరకూ రీమేక్సే ఉంటాయి!

స్టార్‌ హీరోలు, యంగ్‌ హీరోలు తేడాలేదు. అంతా రీమేక్‌లనే నమ్ముకుంటూ వచ్చారు. ఎనభైయవ దశకం నుంచి అదే పరిస్థితి కొనసాగింది. అప్పట్లో శోభన్‌ బాబు, కృష్ణ, చిరంజీవి సినిమాలను కన్నడీగులు రీమేక్‌ చేసుకుంటూ వచ్చారు. ఆ పరంపర ఇటీవలి వరకూ కొనసాగింది. మిర్చి, అత్తారింటికి దారేదీ వంటి సినిమాలను కూడా వదల్లేదు. సింగం వంటి సినిమాలను కూడా రీమేక్‌ చేసుకున్నారు కన్నడ స్టార్‌ హీరోలు. ఆయా సినిమాలు కన్నడలోకి అనువాదం కాకపోవడం, ఒరిజినల్‌ వెర్షన్లు మాత్రమే విడుదల అయ్యి.. ఆయా భాషలు అర్థమయ్యే ప్రేక్షకుల వరకూ రీచ్‌ కావడంతో.. ఆయా సినిమాల రీమేక్‌కు కన్నడ హీరోలకు అవకాశం ఏర్పడింది.

అయితే ఇప్పుడు డైరెక్టుగా ఆ సినిమాలే డబ్బింగ్‌ అవుతూ ఉన్నాయి. దీంతో ఇక నుంచి రీమేక్‌లకు అవకాశం ఉండేలాలేదు కన్నడనాట. ఇప్పటికీ కన్నడ సినిమాల మార్కెట్‌ను ఇతర భాషల సినిమాలు దెబ్బతీస్తున్నాయని ఆ సినిమాల హీరోలు వాపోతూ ఉంటారు. అక్కడ మంచి మంచి ఆర్టిస్టులు బయటకు వచ్చారు. వారిని పక్కభాషల వాళ్లు కూడా పిలిపించుకుని సినిమాలు చేస్తూ ఉన్నాయి. విష్ణువర్దన్‌, ఉపేంద్ర, సుదీప్‌ వంటి హీరోలకు ఇతర భాషల పరిశ్రమలు కూడా మంచి అవకాశాలు ఇచ్చాయి. వారికి ప్రత్యేక పాత్రలను ఇచ్చాయి. వారికి పక్కభాషల్లో కూడా మంచి ఫాలోయింగ్‌ మొదలైంది. అయితే కన్నడనాట మాత్రం ఈ హీరోలు మొదట్లో నవ్యమైన పాత్రలను చేశారు. అయితే ఆ తర్వాత మాత్రం వీళ్లు రీమేక్‌ల రూటే పట్టారు.

విష్ణువర్ధన్‌, ఉపేంద్ర వంటి వాళ్ల కెరీర్‌లు ఆరంభంలో అద్భుతంగా మొదలయ్యాయి. వారి సినిమాలు యావత్‌ దేశాన్నీ ఆకర్షించాయి. అయితే కొన్నాళ్లే అదంతా. ఆ తర్వాత వారు కెరీర్‌ కొనసాగించాలంటే రీమేక్‌ బాటపట్టాల్సి వచ్చింది. అలా రీమేక్‌లతోనే మనుగడ సాగించారు. ఇలాంటి నేపథ్యంలో ఇక నుంచి రీమేక్‌లకు ఛాన్స్‌లు తగ్గిపోతాయి. స్టార్‌ హీరోలే రీమేక్‌లను నమ్ముకుంటూ వచ్చారు. పెద్దగా రీమేక్‌లు చేయనది కేవలం రాజ్‌కుమార్‌ కుటుంబ హీరోలు మాత్రమే. ఇక చోటామోటా హీరోలు అయితే తొలి సినిమాల నుంచే రీమేక్‌ల బాటపట్టారు. ఆఖరికి తెలుగులో యావరేజ్‌గా ఆడిన 'బిందాస్‌' వంటి సినిమాలను కూడా అక్కడ రీమేక్‌ చేసుకున్నారంటే కన్నడోళ్ల కథల కరువును అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు తెలుగు స్టార్‌ హీరోల సినిమాలను ఇతర భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేసినట్టుగానే కన్నడలోకి డబ్‌ చేసి విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో రీమేక్‌ ఛాన్సులు దాదాపుగా తగ్గిపోతాయి. అయితే ఏవైనా సినిమాలు  కన్నడలోకి డబ్‌ కాకుండా, స్టైట్‌గా తెలుగులో విడుదల అయ్యి హిట్‌ అయితే అప్పుడు కన్నడీగులు డబ్బింగ్‌, రీమేక్‌ రైట్స్‌ హోల్‌ సేల్‌గా తీసుకోవచ్చు. అదొక్కడే ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమ మనుగడకు కీలకం అవుతున్న విషయం.

తెరమీద నీతులు.. తెర వెనుక బ్లాక్ మెయిలింగ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?