గోదావరి జిల్లాల్లో రసవత్తర చర్చ
అధికారం చేపట్టి అర్ధ సంవత్సరం తిరక్కండానే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జన హృదయాల్లో చెరగని ముద్ర వేసేదిశగా సాగుతున్నారు. ఈ పరిణామం ప్రతిపక్షాలకు మింగుడుపోనప్పటికీ ఇది మాత్రం నూరుశాతం వాస్తవమని వైకాపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన తదితర రాజకీయ పార్టీలు వైకాపా ప్రభుత్వ విధానాలను పండగడుతూనే ఉన్నాయి. పోలవరం రివర్స్ టెండరింగ్, ఇసుక కొరత వంటి సమస్యలను ప్రధానంగా పేర్కొంటూ జనంలోకి వెళ్లేందుకు టీడీపీ కృషిచేసింది. అయితే పోలవరం రివర్స్ టెండరింగ్ అంశాన్ని అత్యంత చాకచక్యంగా వైకాపా ప్రభుత్వం తమకు అనుకూలంగా తిప్పుకోవడంలో విజయం సాధించింది.
ఇసుక కొరత వ్యవహారాన్ని కూడా ఇదే విధంగా వైకాపా తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వం నామ్‌కేవాస్తే ఇసుకను ఉచితం చేసిందని, వాస్తవంలో సామాన్యుడి చేతికి ఇసుక వచ్చేసరికి ఛార్జీలు తడిసి మోపెడయ్యేవని వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ విధంగా జరగదని, ఇసుక కావల్సినవారు తమ ఇంటి వద్దే వుండి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, సరసమైన ధరకే పొందే విధంగా కార్యాచరణ ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని చెబుతున్నారు.
ఇక మైనింగ్, గ్రావెల్ తవ్వకాల్లోనూ ఇంతవరకూ మైనింగ్ మాఫియా వేలు పెట్టకుండా కొత్త ప్రభుత్వం చూడగలిగింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో చక్రంతిప్పిన మైనింగ్ ఇపుడు జగన్ ప్రభుత్వానికి చేరువయ్యేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ సదరు మాఫియాను జగన్ కూడా ఆక్కున చేర్చుకున్న పక్షంలో యధారాజా తథాప్రజా అన్న చందాన దుస్థితి దాపురించే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మైనింగ్ రాజా వైకాపాలో చేరేందుకు అనేక ప్రయత్నాలు చేసుకుంటున్నారని, సదరు వ్యక్తిని తమ పార్టీలో చేర్చుకున్న పక్షంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.
ఇక సంక్షేమ కార్యక్రమాల విషయంలో జగన్ ప్రభుత్వం దూసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి రాగానే సామాజిక భద్రతా పింఛన్లను 2250 రూపాయలకు పెంచడంతో పాటు గ్రామ/వార్డు వాలంటర్లీను నియమించారు. మద్యం దుకాణాల నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోర తెచ్చి, ప్రతీ దుకాణంలోనూ ఇద్దరికి ఉద్యోగం కల్పించారు. కీలకమైన గ్రామ సచివాలయ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి సుమారు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.
సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారిలో వైకాపా సహా టీడీపీ, జనసేన పార్టీలకు చెందినవారూ ఉన్నారని, అత్యంత పారదర్శకంగా ఉద్యోగాల నియామకాలు చేపట్టామని జగన్ ప్రకటించారు. ఉగాది నాటికి రాష్ట్రంలో పెద్దఎత్తున ఇళ్ళు, ఇళ్ళ స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి పిల్లిబోసు ఇదే విషయమై మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులను అత్యంత పారదర్శకంగా జనానికి అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. భూముల రీ సర్వే నిర్వహిస్తామని, భూ ఆక్రమణలు, కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు.
అర్హులైన పేదరందరికీ పక్కా ఇళ్ళు మంజూరు చేస్తామని స్పష్టంచేశారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాల కల్పనకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇంటి వద్దకే రేషన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. చౌకధరల దుకాణాలకు వెళ్ళకుండా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా రేషన్‌ను లబ్ధిదారుల ఇళ్ళకే నేరుగా చేర్చేందుకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.