Advertisement

Advertisement


Home > Politics - Gossip

కేసీఆర్‌ ఆత్మరక్షణలో పడుతున్నారా!

కేసీఆర్‌ ఆత్మరక్షణలో పడుతున్నారా!

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలిసమ్మె తీవ్రరూపం దాల్చడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇబ్బందికరమైన అంశమే అని చెప్పాలి. అది సకల జనుల సమ్మె వైపు నిజంగానే వెళితే మొత్తం సమాజాన్నే కుదిపివేసే విషయం అవుతుంది. కేసీఆర్‌ బహుశా ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఆర్టీసి కార్మికుల సమ్మె సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆర్టీసిని ఏభైశాతం ప్రైవేటీకరిస్తామని ఆయన అంటున్న వైనం రాజకీయంగా ఆయనకు నష్టం చేయవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది.

అంతేకాదు.. కార్మికులను ఉద్దేశించి ఏభైవేల మందిని తొలగించేశామని చెప్పిన వైనం ప్రజాస్వామ్యంలో సరైనదేనా అన్న చర్చ జరుగుతోంది. అంతకన్నా సెప్టెంబర్‌ నెలలో పనిచేసిన కాలానికి ఆర్టీసి కార్మికులకు జీతం ఇవ్వకుండా ఆపడం అమానవీయం అని చెప్పక తప్పదు. అంతేకాదు. సమ్మెలో ఉన్న ఆర్ట్టీసి కార్మికులకు తార్నాక ఆస్పత్రిలో చికిత్సలు నిలిపివేయడం అమానుషం అని చెప్పక తప్పదు. ఒకప్పుడు ఆర్ట్టీసి కార్మికులకు కాలిలో ముల్లు గుచ్చుకుంటే నాలుకతో ముల్లు తీస్తానని అన్న కేసీఆర్‌, కేవలం పండగ అడ్వాన్స్‌ కోసం గతంలో ఆర్టీసి కార్మికుల తరపున దర్నాలు చేసిన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసి కార్మికులతో తగాదా పెట్టుకోవడం, అసలు సంఘాలే ఉండరాదని అనే పరిస్థితికి వెళ్లడం చారిత్రక విషాదమే అనిచెప్పాలి.

ప్రస్తుతం కార్మిక సంఘాల జేఏసీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి టీఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ ముఖ్యనేతలకు సన్నిహితుడే. అప్పట్లో హరీష్‌రావు నేతృత్వంలో టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఆర్టీసిలో కార్మికసంఘం ఏర్పాటు చేసి, కార్మికసంఘం ఎన్నికలలో విజయం సాధించింది వాస్తవం కాదా? ఇక్కడ సమస్య ఆర్టీసి కార్మికుల సమ్మె న్యాయబద్దమా? కాదా? అన్నది కాదు. ఇక్కడ చర్చ ఆర్టీసి కార్మికులు తప్పుచేశారా? లేదా? పండగకు ముందు సమ్మెలోకి వెళ్లి ఆర్టీసికి, ప్రయాణికులకు కష్టనష్టాలు తెచ్చిపెట్టారా? లేదా అన్నది కాదు. కేసీఆర్‌ వ్యవహార శైలి చర్చనీయాంశం అవుతోంది. నిజమే ఆర్టీసి కార్మికుల సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రత్యామ్నాయం చూడడం తప్పుకాదు. కాని వారిని సరైన తీరులో హాండిల్‌ చేయకపోవడం వల్ల ఈ సమస్య ఇంతదాకా వచ్చిందన్న భావన కలుగుతోంది.

పైగా గతంలో తమిళనాడులో ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ ఉద్యోగులు లక్షాడెబ్బై వేల మందిని ఒక కలం పోటుతో తీసివేస్తున్నట్లు ప్రకటించిన మాదిరే ఇక్కడ కేసీఆర్‌ కూడా ఏభైవేల మంది ఉద్యోగాలు తీసేశానని ఒకసారి, సెల్ప్‌ డిస్మిస్‌ అయ్యారని మరోసారి అంటున్నారు. జయలలిత ఉద్యమ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి కాలేదు. ఆమె ఎంజీఆర్‌ వారసురాలిగా, సినిమా నటిగా గుర్తింపు పొంది ప్రజల మద్ధతుతో ముఖ్యమంత్రి అయ్యారు. కాని కేసీఆర్‌ ఉద్యమాలు చేశారు. తెలంగాణ సాదనలో కర్మ,ఖర్మ, క్రియ అన్నీ తానే అని ఆయనే చెప్పుకుంటారు. అనేక రకాల సమ్మెలకు ఆయన అప్పట్లో బాధ్యత వహించారు. సకలజనుల సమ్మె వంటివాటిని ఆయన ప్రోత్సహించారు. ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒంటి కాలితో లేచేవారు.

కార్మికులకు తానే అండ అన్నట్లుగా మాట్లాడేవారు. గతంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరిస్తే, విభజిత ఏపీలో కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆర్టీసి కార్మికులను ప్రభుత్వంలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది సరైనదా? కాదా? అన్నదానిపై చర్చించవచ్చు. కాని గతంలో కేసీఆర్‌ కూడా పలుమార్లు ఇదే హామీ ఇచ్చారని అంటున్నారు. మరి అది వాస్తవం అయితే ఆయన ఇప్పుడు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారో వివరణ ఇవ్వాలి. ఆర్టీసికి ఏభైవేల కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు ఆర్టీసిని ప్రభుత్వం నడపలేకపోవడం వైఫల్యం కాదా? తెలంగాణ ఉద్యమాన్ని తీసుకువచ్చిందే నిధులు, నీళ్లు,నియామకాల అంశాల మీదకదా? ప్రభుత్వ ఉద్యోగాలు వేరే వారు పొందుతున్నారనే కదా..

మరి ఇప్పుడు కేసీఆర్‌ అసలు ఉన్న ఆర్టీసి ఉద్యోగాలను తీసేస్తానని అనడం ఏమి సంకేతం. పైగా ఆయన పదే, పదే తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెబుతూ వచ్చారు కదా? ఆర్టీసికి సంబంధిందించి 2500 కోట్ల రూపాయల నష్టాలను తీర్చలేకపోయారా? ప్రైవేటు రంగానికి నేరుగా అప్పగించడం ద్వారా ప్రజా రవాణాను కేసీఆర్‌ మెరుగుపరుస్తారా? మరింత సమస్యలలోకి తీసుకువెళుతున్నారా? ఇదేపని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసి ఉంటే ఒప్పుకునేవారా? గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్‌ చార్జీలు పెంచితేనే తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్‌, తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌ ఇప్పుడు ఇంత కఠిన వైఖరి తీసుకోవడం అవసరమా? అంటే తద్వారా చంద్రబాబు మాదిరి కేసీఆర్‌ కూడా మాటలు మార్చుతున్నారన్న విమర్శకు ఆస్కారం ఇవ్వడం లేదా?

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా మొదటిసారి ఇలాంటి తీవ్రమైన సమస్యను ఎదుర్కుంటున్నట్లుగా ఉంది. ప్రతిపక్షాలకు ఆయనే ఒక ఆయుధ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఏ సమస్య అయినా చర్చలు, సంప్రదింపుల ద్వారా కొంతమేర పరిష్కారం చేసుకోవచ్చు. అందులోను కేసీఆర్‌ వంటి మాటకారికి ఇది పెద్ద ఇబ్బంది కాదు. కాని ఆయన ఎందుకు అహం దెబ్బతిన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక వరసగా తప్పులు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. మంత్రులకు అసలు పెద్దగా విలువ ఇవ్వకపోవడం నుంచి కార్మిక సంఘాల వారితో సామరస్యంగా చర్చలు జరపలేని పరిస్థితిలోకి వెళ్లడం ప్రభుత్వ లోపంగా కనిపిస్తుంది.

ప్రజాస్వామ్యం గురించి పెద్దఎత్తున మాట్లాడే కేసీఆర్‌ ఇదే పోకడలు కొనసాగిస్తే ఆయనకే నష్టం. ఎప్పటికీ రాజ్యం తమదేనని ప్రజాస్వామ్యంలో ఎవరు అనుకున్నా ప్రమాదమే. జయలలిత కూడా ఇలా వ్యవహరించినప్పుడు దెబ్బతిన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. మరి కేసీఆర్‌ కూడా అందుకు సిద్ధపడతారా? ఆయన అంత తెలివితక్కువ వారు కాదు. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట అన్న పేరు ఉన్న నేతే. ఆయన మొండిపట్టుదలకు పోకుండా మధ్యవర్తుల ద్వారా రాయబారం చేయించి ఆర్టీసి సమ్మెకు ఎంత సత్వరమే పరిష్కారం తీసుకువస్తే అంతమంచిది. లేకుంటే ఇప్పుడు కొంతమేర ప్రజలలో కార్మికులపై కూడా ఆగ్రహం ఉండవచ్చు.

తెరమీద నీతులు.. తెర వెనుక బ్లాక్ మెయిలింగ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?