అస్సలు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఏం అంచనాలు లేవు. ఏదో తీస్తున్నారు అని అనుకోవడమే తప్ప. ఆ సినిమానే కాశ్మీర్ ఫైల్స్. కాశ్మీర్ లో ఒకప్పుడు కాశ్మీరీ పండిట్స్, కాశ్మీరీ హిందువులు పడిన బాధలు, మరుగున దాగిపోయిన కొన్ని అరాచకాలు, మరి కొన్ని వాస్తవాలు ఇవన్నీ కలిసి సినిమా తీయడం మొదలైంది.
గమ్మత్తుగా ఈ హిందీ సినిమాకు నిర్మాత టాలీవుడ్ కు చెందిన అభిషేక్ అగర్వాల్. ఇదంతా కొంత కాలం కిందటి సంగతి. కానీ ఇప్పుడు ఆ సినిమా విడుదలయింది. విడుదలకు ముందు కూడా ఏ హడావుడి లేదు. పబ్లిసిటీ పెద్దగా ఏమీ చేయలేదు.
కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సినిమా గురించి ఎక్కవగా మాట్లాడుతున్నారు. ఈ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కి ఓవర్ నైట్ మాంచి పేరు వచ్చేసింది. చాలా డేరింగ్ గా వాస్తవాలు చిత్రీకరించారని హిందూత్వ వాదులు తెగ ప్రశంసిస్తున్నారు.
ఎక్కడికక్కడ హిందూ అనుకూల వాదులు, అనుకూల మీడియా ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాయి. దాంతో ఎవరికీ పెద్దగా తెలియకుండానే విడుదలయిన ఈ సినిమా మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలకు పోటీగా స్క్రీన్ లను పెంచుకుంటోంది.
పల్లవీ జోషీ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను హిందూత్వ మేధావులు చూసి సోషల్ మీడియాలో పరిచయం చేస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఈ సినిమా మేకర్లు అయిన అభిషేక్ అగర్వాల్, పల్లవీ జోషీ, వివేక్ అగ్నిహోత్రిలను పిలిపించి అభినందించడం విశేషం. మొత్తం మీద ఓ తెలుగు నిర్మాత సినిమా దేశవ్యాప్తంగా ప్రశంసలకు, చర్చకు దారితీయడం విశేషం.