విజయవాడ కనకదుర్గ వారధిపై ఏర్పాటు చేసిన జనసేన ఫ్లెక్సీని తొలగించడం రచ్చకు దారి తీసింది. గుంటూరు జిల్లాలో రేపటి జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సందర్భంగా సభపై జనసేన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. రానున్న ఎన్నికలకు జనసేన శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ సభే సరైన వేదికగా పవన్‌కల్యాణ్ భావిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు మునుపెన్నడూ లేని విధంగా జనసేనాని వివిధ కమిటీలను వేసి దూకుడు ప్రదర్శించారు.
పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ నేపథ్యంలో జనసేనలో సమరోత్సాహం కనిపిస్తోంది. పార్టీ ప్రముఖులు సభా వేదిక వద్దకు తరచూ వెళుతూ కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గ వారధిపై జనసేన సభకు సంబంధించి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేకుండా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారంటూ పోలీసులు తొలగించారు.
ఇది వివాదానికి దారి తీసింది. ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారంటూ జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్ తదితరులు పోలీస్ అధికారులను నిలదీసే వీడియోలు వివిధ మాధ్యమాల ద్వారా ఆ పార్టీ వైరల్ చేస్తోంది. విజయవాడ కమిషనర్ ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? మీరు ఎలా తొలగిస్తారని నాదెండ్ల నిలదీస్తున్న వీడియోలపై జనసైనికులు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, సభను విఫలం చేసే కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలకు దిగుతోందంటూ జనసేన నాయకులు పెద్దపెద్ద విమర్శలు చేస్తున్నారు. ఆవిర్భావ సభకు ప్రచారం తెచ్చేందుకే జనసేన ఛీప్ ట్రిక్స్ చేస్తోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. సభను అడ్డుకునే ఉద్దేశం తమకు లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.