వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలకు విలువే లేదా? ఆమె అంటే టీడీపీకి అంత అలుసా? …ఔననే సమాధానం వస్తోంది. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆమెను తీసి పారేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ప్రభుత్వం వేడుక నిర్వహించింది. ఈ సభలో సీఎం జగన్ సమక్షంలో సినిమా డైలాగ్‌లతో చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీపీ నేతలపై రోజా విరుచుకుపడ్డారు.
ఇవాళ టీడీపీ నేత బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ రోజా విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రోజా ఇష్టానుసారం మాట్లాడుతుంటే సీఎం జగన్ ముసిముసి నవ్వులు నవ్వారన్నారు. చంద్రబాబునాయుడు, తమను తిట్టిస్తూ … సీఎం జగన్ ఆనందపడిన విధానాన్ని ప్రశ్నిస్తున్నట్టు బుద్ధా తెలిపారు. ఎమ్మెల్యే రోజా మాటలకు విలువ ఉండదన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని బుద్ధా కొట్టి పారేశారు.
టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబు బామ్మర్ది బాలయ్య నటించిన అఖండ సినిమాలోని డైలాగ్‌లతో సందర్భోచితంగా టీడీపీ నేతల్ని రోజా ఉతికి ఆరేశారు. రోజా ప్రసంగం వింటూ జగన్ నవ్వుతూ కనిపించారు. అలాగే సభకు హాజరైన మహిళల్లో రోజా ఉత్తేజాన్ని నింపారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పాత్ర వుందని రోజా ఘాటు విమర్శలు చేశారు.
ఒకవైపు రోజా మాటలు ముల్లులా గుచ్చుకుంటున్నా, వాటిని పట్టించుకోనట్టు బుద్ధా వెంకన్న బిల్డప్ ఇవ్వడం విశేషం. రోజా మాటలతో కొట్టిన దెబ్బల బాధ, తిన్నవాళ్లకు తప్ప, అన్న వాళ్లకేం తెలుస్తుందనే అభిప్రాయాలు టీడీపీ నేతలే వెలిబుచ్చడం చూశాం. కానీ తనకేమీ నొప్పి లేనట్టు బుద్ధా వెంకన్న మాట్లాడ్డం కాసింత ఆశ్చర్యం కలిగిస్తోంది.