పత్రికను నడపడంలో తెలుగునాట అందె వేసిన చెయ్యి ఎవరిదంటే రామోజీ రావుదే అంటారు అంతా. రామోజీరావు పట్టిందల్లా బంగారం అయ్యిందనే మాటా వినిపిస్తూ ఉంటుంది. అయితే రామోజీరావు పలు వ్యాపారాలను ప్రారంభించాకా చేయి కాలిందో ఏమో కానీ ఆయన వాటిని మూసేశారు కూడా. అలాంటి వాటిలో ఆయన ఆరంభించి, మూసేసిన ఇంగ్లిష్ పత్రిక కూడా ఒకటి.
ఇక రామోజీ గ్రూప్ కు సంబంధించిన ప్రింట్ ఎడిషన్లు చతుర, విపుల, బాలభారతం, సితార వంటివి కూడా ఇప్పుడు ప్రింట్ లో ఎక్కడా కనిపించడం లేదు. ప్రింట్ ఎడిషన్ల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్న దశలోనే ఇవన్నీ ప్రింట్ కావడం లేదని అనుకోవాలి!
ఆ సంగతలా ఉంటే.. ఆదివారం మధ్యాహ్నం ఈనాడు డాట్ నెట్ ఓపెన్ చేసి చూస్తే.. ఎక్కువ మంది చదివినవి అనే కేటగిరిలో ఒక ఆసక్తిదాయకమైన టైటిల్ కనిపించింది. అదే రాశీ ఫలం! ఆదివారం ఆరంభం అయ్యాకా పన్నెండు గంటల తర్వాత కూడా.. ఈనాడు డాట్ నెట్ లో ఎక్కువ మంది చదివినవి రాశీ ఫలాలే కావడం గమనార్హం!
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ, సినిమా, క్రీడా, సామాజిక, ప్రజాసంబంధ వార్తలను ప్రచురించే వెబ్ సైట్లో ఎక్కువ మంది చదివింది రాశీ ఫలం! అంటే ఇది అన్ని రకాలుగానూ ఆశ్చర్యకరమే. డిజిటల్ ఎడిషన్ల జనరేషన్లో కూడా పాఠకుల ఆసక్తి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇదొక పరిశీలన అనుకోవాలేమో!
గతంలో ఆదివారం వస్తే.. సండే సప్లిమెంటరీలో రాశీ ఫలాల కోసమే ఎక్కువ మంది వెదుక్కొనే వారు. డిజిటల్ యుగంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని ఈనాడు టాప్ వ్యూస్ జాబితానే చెబుతోంది. ఈ విషయంలో సాక్షి కూడా విజయవంతంగా సాగింది కానీ, దేన్నైనా సవ్యంగా సాగుతుంటే దాన్ని మార్చడంలో సాక్షి యాజమాన్యం ముందుటుంది. అందుకే ఒక దశలో ఫ్యామిలీలో సగం పేజీ పాటు మైలవరపు చేత రాశీఫలాలు రాయించి, ఆ తర్వాత ఉన్నట్టుండి ఆశీర్షికను కంప్లీట్ గా మూసేయించింది.
సాక్షి ఫ్యామిలీ ఎడిటర్ గా ప్రియదర్శిని రామ్ ఉన్నన్ని రోజులూ.. ఆ పేపర్లలో రాశీ ఫలాలకూ మంచి ప్లేస్ కేటాయించే వారు. ఆదివారం రోజున రెగ్యులర్ రాశీ ఫలానికి తోడు, టారో పేరిట ఇన్షియా చేత రాశుల ఆధారంగా వారపు జాతకం రాయించే వారు. రెండు పేజీల రాశీ ఫలాలు ప్రచురితం అయ్యేవి ఫన్ డే లో.
ఆ తర్వాత మైలవరం చేత శనివారం రోజున ఫ్యామిలీ రెండు, మూడో పేజీల్లో సగం పేజీలు సుదీర్ఘంగా రాశీ ఫలాలు రాయించారు. రామ్ ఆధ్వర్యంలో ఇలా దాదాపు రెండేళ్ల పాటు సాగింది. అయితే ఆ తర్వాత మార్పు చేసేసే వరకూ నిద్రపోలేదు సాక్షి యాజమాన్యం. మైలవరం రాసే ఆ రాశీఫలం ఫీల్ గుడ్ ధోరణి లో పాజిటివ్ గా సాగేది!
ఇక టైటిల్ లో పేర్కొన్న విషయానికి వస్తే, ఈనాడు ఆదివారం అనుబంధంలో రాశీఫలం శీర్షికను ప్రచురించాలంటూ ఎడిటోరియల్ టీమ్ చాలా సూచనలు చేసినా రామోజీ పట్టించుకోలేదట. వ్యక్తిగతంగా వాటిని నమ్మని రామోజీ అందుకు దశాబ్దాల పాటు ససేమేరా అంటూ వచ్చాడట. అయితే పాఠకుల అభిరుచి మేరకు, ఆసక్తి మేరకు రాశీఫలం ప్రచురించాలంటూ ఎడిటోరియల్ టీమ్ తీవ్రంగా చెబుతూ ఉండే సరికి ' సరే మీ చావు మీరు చావండి…' అంటూ రామోజీ పేపర్లను విసిరేసి వెళ్లాడట. అప్పుడు కూడా రామోజీకి ఇష్టం లేకుండా నే అలా సమ్మతి తెలిపాడంటూ ఈనాడు పాత జర్నలిస్టులు చెబుతుంటారు.
మరి రామోజీ దశాబ్దాల పాటు ప్రచురించకుండా ఆపిన ఫీచర్ ఆ తర్వాత ఈనాడు ఆదివారం అనుబంధంలో స్థానం సంపాదించి, వెబ్ లో కూడా మోస్ట్ వ్యూడ్ లో తొలి స్థానంలో నిలుస్తుండటం గమనార్హం.