ఎవరెలాంటి రాజకీయాలు చేసినా… అంతిమంగా అధికారం కోసమే. 2024లో ఏపీ అధికారం ఎవరిదో తెలియాలంటే అంత వరకూ వేచి చూడాల్సిన పనిలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు పార్టీల మధ్య సమీకరణలే, రాష్ట్ర అధికారాన్ని శాసిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మిగిలిన రాజకీయ పక్షాలు విడివిడిగా ఎదుర్కోవడం అసాధ్యం.
అలాగని టీడీపీకి ప్రాణం పోసేందుకు జనసేన, బీజేపీ తమను తాము మరోసారి బలి పెట్టుకుంటాయా? లేక టీడీపీని శాశ్వతంగా అధికారానికి దూరం చేసేలా పావులు కదుపుతాయా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి రేపటి జనసేన 9వ ఆవిర్భావ సభ సమాధానం ఇవ్వనుంది. అందుకే జనసేన ఆవిర్భావ సభ ఉత్కంఠ రేపుతోంది.
ఆవిర్భావ సబలో జనసేనాని ఏం మాట్లాడ్తారనే అంశం వైసీపీ, టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జనసేన మిత్రపక్షం బీజేపీ విజయదుందుభి మోగించిన నేపథ్యంలో, ఆ పార్టీతో భవిష్యత్‌లో సంబంధాలు ఎలా ఉండ బోతున్నాయో పవన్ స్పష్టత ఇవ్వనున్నారు.
రానున్న రోజుల్లో పొత్తులు ఎవరెవరితో ఎలా ఉంటాయో, అనేక అనుమానాలు, ప్రశ్నలకు ఈ ఆవిర్భావ సభా వేదికపై నుంచి పవన్ దీటైన సమాధానం ఇవ్వనున్నారు.
సభలో తన ప్రసంగంపై పవన్ కాసేపటి క్రితం స్పష్టత ఇచ్చారు. రేపటి సభ ప్రాధాన్యం గురించి వివరిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన ప్రసంగంలో ఏయే అంశాలు ఉండనున్నాయో ఆయన స్పష్టత ఇచ్చారు. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే…
“ఈ 14న జరగనున్న ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని ఆవిర్భావ దినోత్సవాల్లా చూడడం లేదు. ఈ కీలకమైన సభలో రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై మాట్లాడబోతున్నా. చాలా మందికి చాలా సందేహాలున్నాయి. ఎన్నో విమర్శలు చేశారు. వాటి అన్నింటిపై 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో సమాధానం చెబుతాను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలను, రాష్ట్ర భవిష్యత్‌ను దిశానిర్దేశం చేయబోతున్నాం. గత రెండున్నరేళ్లలో ఏం జరిగింది? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు, ఉపద్రవాలు ఎదుర్కొన్నారు? భవిష్యత్ ఎలా ఉండబోతోంది? భావి తరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే బలమైన భవిష్యత్ ఇవ్వగలం? తదితర అంశాలపై మాట్లాడ్తా” అని పవన్‌కల్యాణ్ స్పష్టత ఇవ్వనున్నారు.
రేపటి సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగం రాష్ట్ర రాజకీయాలపై ఒక స్పష్టత ఇస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్ అధికారం ఎవరిదో రేపటి జనసేన సభతో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అందుకే ఆ సభపై అందరి దృష్టి.