సెకెండ్ వేవ్ లో బాలీవుడ్ ను కరోనా కుదిపేస్తోంది. ఇప్పటికే అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు వైరస్ బారిన పడగా.. తాజాగా స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా కరోనా బారిన పడింది. ఆమె బాయ్ ఫ్రెండ్ విక్కీ కౌశల్ కు పాజిటివ్ అని తేలిన 24 గంటల్లోనే కత్రినాకు కూడా కరోనా సోకింది.
తనకు కరోనా సోకిన విషయాన్ని కత్రినాకైఫ్ అధికారికంగా ప్రకటించింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, వెంటనే హోం ఐసోలేషన్ లోకి వెళ్లానని తెలిపింది. రీసెంట్ గా తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని కోరింది.
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో కత్రినాకైఫ్ డేటింగ్ చేస్తోందనే రూమర్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అటు విక్కీ, ఇటు కత్రినా ఒక రోజు తేడాలో కరోనా బారిన పడడం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం కత్రిన-అక్షయ్ కలిసి సూర్యవంశీ అనే సినిమా చేశారు. కరోనా సోకిన తర్వాత హోం ఐసోలేషన్ లో ఉన్న అక్షయ్ కుమార్, ఈరోజు ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం పెద్ద చర్చకు దారితీసింది.
చూస్తుంటే.. ఈసారి బాలీవుడ్ ను కరోనా గట్టిగానే తాకినట్టు కనిపిస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో భారీ సినిమాలన్నీ మరోసారి పోస్ట్ పోన్ కాబోతున్నాయి. ఈ మేరకు బడా నిర్మాణ సంస్థలు కొన్ని, ఈరోజు రాత్రి ఆన్ లైన్ లో సమావేశమౌతున్నాయి. సినిమాల వాయిదాలపై అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.