షూటింగ్ టైమ్ లో చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజం. మరీ ముఖ్యంగా డాన్స్ చేస్తున్నప్పుడు హీరోహీరోయిన్ల మధ్య సమన్వయం లేకపోతే చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. హీరోయిన్ కీర్తిసురేష్ విషయంలో కూడా అదే జరిగింది. పొరపాటున మహేష్ మొహంపై ఆమె పలుమార్లు చేయి చేసుకుంది.
“ఓసారి ఓ సాంగ్ షూటింగ్ లో డాన్స్ లో నాది చిన్న కోఆర్డినేషన్ మిస్సయింది. తెలియకుండానే మహేష్ ఫేస్ మీద లైట్ గా టచ్ చేశాను. 2-3 సార్లు అలా జరిగింది. చాలా సేపు చూసి మహేష్ ఇక టీజింగ్ స్టార్ట్ చేశారు. నేనేమైనా తప్పు చేశానా, ఎందుకిలా కొడుతున్నావంటూ టీజింగ్ మొదలుపెట్టారు. నేను ఎన్నిసార్లు సారీ చెప్పానో లెక్కలేదు.”
ఇలా సర్కారువారి పాట సాంగ్ షూట్ లో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకుంది కీర్తిసురేష్. మహేష్ లో మంచి సెటైరిక్ సెన్స్ ఉందని, తనను చాలాసార్లు టీజింగ్ చేశారని చెప్పుకొచ్చింది ఈ నేషనల్ అవార్డ్ గ్రహీత.
“సెట్స్ లో నన్ను చాలాసార్లు టీజింగ్ చేశారు మహేష్. ఎప్పుడైనా సెట్స్ లో నేను తప్పుగా చేసినప్పుడు ఓ రేంజ్ లో టీజ్ చేసేవారు. ఒక్కోసారి మహేష్ నన్ను ఏడిపిస్తున్నారనే విషయం కూడా నాకు అర్థమయ్యేది కాదు, అంతా కలిసి నవ్వుకునే వారు. ఆ తర్వాత నాకు అర్థమయ్యేది. మహేష్ టీజింగ్ చేస్తే ఆ రేంజ్ లో ఉంటుంది.”
ఖాళీ టైమ్ లో కీర్తిసురేష్ తన సినిమాలు మాత్రం చూడదట. అలా చూస్తే తను చేసిన మిస్టేక్స్ మళ్లీ తనకు గుర్తొస్తాయంట. అందుకే తన సినిమాలు కాకుండా, ఇతర సినిమాలు చూస్తానని అంటోంది. దాంతో పాటు తన పెంపుడు కుక్క నైకీతో ఆడుకుంటానని, బాగా తింటానని చెబుతోంది.