పెద్ద సినిమాలన్నీ రన్ టైమ్ విషయంలో తగ్గేదేలే అంటున్నాయి. రెండున్నర గంటలు మాత్రమే నిడివి ఉండాలనే రూల్ ను పాటించడం లేదు. అవసరమైతే 3 గంటలు సినిమా చూపిస్తామంటున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి కేజీఎఫ్2 కూడా చేరిపోయింది. యష్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమా 168 నిమిషాలుంది.
కేజీఎఫ్ ఛాప్టర్-1 రెగ్యులర్ రన్ టైమ్ (2 గంటల 34 నిమిషాలు) తోనే వచ్చింది. కానీ పార్ట్-2కు వచ్చేసరికి మాత్రం మేకర్స్ కాంప్రమైజ్ కాలేదు. మారిన పరిస్థితుల దృష్ట్యా కంటెంట్ బాగుంటే ప్రేక్షకుడు అదనంగా మరో 15-20 నిమిషాలు కూర్చోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడనే విషయం రుజువైంది. దీంతో కేజీఎఫ్ పార్ట్-2ను కుదించాలనుకోలేదు. 2 గంటల 48 నిమిషాల నిడివితో సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.
రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా 3 గంటల 2 నిమిషాలుంది. మహర్షి సినిమా 2 గంటల 48 నిమిషాలుంది. అర్జున్ రెడ్డి, మహానటి, భరత్ అనే నేను, రంగస్థలం, అరవింద సమేత, మహర్షి.. ఇలా చాలా సినిమాలు రెండున్నర గంటల్లో సినిమాను చూపించాలనే ఫార్మాట్ నుంచి బయటకొచ్చేశాయి. కాబట్టి కేజీఎఫ్ 2 విషయంలో కూడా అలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోలేదు మేకర్స్.
ఇలా భారీ నిడివి వల్ల లాభం-నష్టం రెండూ ఉన్నాయి. సినిమాలో కంటెంట్ కనెక్ట్ అయితే మేకర్స్ భావించినప్పుడు అదనంగా ఇంకాసేపు కూర్చోవడానికి ప్రేక్షకుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏమాత్రం తేడాకొట్టినా, లాంగ్ రన్ టైమ్ వల్ల టోటల్ సినిమాపైనే నెగెటివ్ అభిప్రాయానికి వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని సినిమాల విషయంలో ఇది జరిగింది కూడా.
మేకర్స్ ఆలోచన ఎలా ఉన్నప్పటికీ.. ఇలా రన్ టైమ్ పెంచడం ప్రేక్షకుడి సమయాన్ని వృధా చేయడమే అవుతుంది. ఓవైపు 2 గంటల్లోనే సినిమాను ముగించేయాలంటూ ఈతరం కోరుకుంటుంటే, మరోవైపు ఇలా నిడివిని పెంచుకుంటూ పోతోంది టాలీవుడ్. బహుశా, ఈ ఒక్క విషయంలో ఎవ్వర్నీ తప్పుపట్టలేం.