వేటగాడు మెత్తనైతే లేడి మూడు కాళ్లతో గెంతిందని సామెత. నిర్మాతలు గట్టిగా పట్టుకోకపోతే నిర్మాణవ్యయం ఎక్కడికో వెళ్లిపోతుంది. సినిమా రంగంలో నిర్మాతలు ఏమాత్రం ఉదాసీనంగా వున్నా ఖర్చు అలా పెరిగిపోతూనే వుంటుంది. సగంలోకి వచ్చాక ఏమీ చేసే పరిస్థితి వుండదు.
లేటెస్ట్ గా రాబోతున్న రామబాణం సినిమా సంగతి ఇలాగే వుంది. గోపీచంద్ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలో తయారైన ఈ సినిమా టోటల్ ఖర్చు 50 కోట్లు అంటే టాలీవుడ్ లో ముక్కు మీద వేలు వేసుకోని వారు వుండరు. ప్రింట్, పబ్లిసిటీ, ఇంట్రస్ట్ లతో కలిపి అక్షరాలా యాభై కోట్లు అంటే ఏమనుకోవాలి? ఎంత కోవిడ్ కాస్త అడ్డం పడింది అనుకున్నా మరీ ఇంత ఖర్చా? అది కూడా గోపీచంద్ హీరోగా?
పీపుల్స్ మీడియా సంస్థ ఇప్పుడు చాలా మందికి కామధేనువులా కనిపిస్తోంది. సినిమాలు మంచిగా వుంటున్నాయి. మంచి హిట్ లు అవుతున్నాయి కనుక సరిపోతోంది. లాభాలు వస్తున్నాయి. కానీ విడుదలకు ముందు మాత్రం ఓవర్ బడ్జెట్ అవుతున్నాయి. కార్తికేయ 2, ధమాకా రెండూ ఇదే మాదిరి. ఇప్పుడు రాబోతున్న రామబాణం మరీ దారుణం. గోపీచంద్ తో సినిమాకు దర్శకుడు శ్రీవాస్ భారీగా ఖర్చు చేయించేసారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
సాహు నిర్మిస్తున్న ఉగ్రం సినిమా కూడా ఇలాంటిదే. అల్లరి నరేష్ హీరోగా తయారవుతున్న ఈ సినిమా బడ్జెట్ ఇప్పటకే 14 కోట్లు దాటేసింది. దీనికేమీ కోవిడ్ అడ్డం పడలేదు. దర్శకుడు క్వాలిటీ కోసం పరితపించడం వల్ల కావచ్చు.
నాని దసరా సంగతి వేరు. భారీగా ప్లాన్ చేయడం వల్ల 70 కోట్లకు చేరింది ప్రింట్ అండ్ పబ్లిసిటీతో కలిపి ఖర్చు. దాంతో ఇప్పుడు థియేటర్ ఓవర్ ఫ్లోస్ వస్తేనే నిర్మాతకు ఆనందం. ఇప్పటికే శ్యామ్ సింగరాయ్, జెర్సీ లాంటి సినిమాలు హిట్ అనిపించుకున్నా నిర్మాతలకు ఆనందం ఏమీ ఇవ్వలేదు.
ఇలా ఖర్చు పెరిగిపోవడం వల్ల సినిమాలు డెఫిసిట్ లో విడుదలవ్వాల్సిన పరిస్థితి. థియేటర్ల పరిస్థితి బాగా లేని టైమ్ లో థియేటర్ల ఆదాయం మీద ఆధారపడాల్సిన పరిస్థితి. దర్శకులు ఆలోచించకపోతే నిర్మాతలు గుల్లయిపోతారు.