టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకు సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అయ్యన్నపై నమోదైన ఫోర్జరీ కేసుకు సంబంధించి దర్యాప్తునకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. ఫోర్జరీ కేసుకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేస్తు.. సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని సుప్రీం కోర్టు సృష్టం చేసింది.
గతంలో మంత్రిగా పని చేసిన అయ్యన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ఇంటి ప్రహరి నిర్మాణం చేశారని రెవెన్యూ యంత్రాంగం గుర్తించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నించగా అయ్యన్న కుమారుడు చింతకాయల విజయ్ నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో ఎన్‌వోసీ ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని పెద్ద హడావుడినే చేశారు. తీరా సదరు అధికారి ఎన్‌వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది.
ఫోర్జరీ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెడుతూ.. ఫోర్జరీ కేసు దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. గత కొంత కాలంగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిలాగా సీఎం జగన్ పై వ్యక్తిగతంగా బూతులు మాట్లాడుతూ నిత్యం వార్తల్లో ఉండే అయ్యన్న ఇవాళ ఫోర్జరీ కేసులో మరోసారి వార్తల్లోకి వచ్చారు.