తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నసమయంలో కే ట్యాక్స్ పేరుతో అనేకమంది నుంచి డబ్బులు వసూలు చేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న కోడెల శివరాం లొంగిపోయారు. ఇన్నిరోజులూ వివిధ కేసుల విచారణను తప్పించుకుంటూ ఆయన పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ స్పీకర్, ఇటీవలే మరణించిన కోడెల శివప్రసాద్ రావు తనయుడు అయిన కోడెల శివరాంపై ఇప్పటికే ఎంత దుమారం రేగిందో చెప్పనక్కర్లేదు. కోడెల ఆత్మహత్య తర్వాత ఈయన బయటకు వచ్చారు.
ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ కు దాఖలు చేసుకోగా.. ముందు లొంగిపోవాలని ఆయనకు కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఆయన లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. కోడెల శివరాం బాధితులమంటూ ఇప్పటి వరకూ పంతొమ్మిది మంది పోలిస్ స్టేషన్ కు ఎక్కినట్టుగా తెలుస్తోంది. వారి ఫిర్యాదుల మేరకు నమోదైన కేసుల్లో ఇప్పటి వరకూ నాలుగు కేసుల్లో కోడెల శివరాంకు బెయిల్ దక్కింది.
మిగతా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోడెల శివరాం లొంగిపోయారు. ఇక మిగిలిన కేసుల్లో కూడా ఆయనకు బెయిల్ దక్కేనా? లేక కోడెల శివరాంకు రిమాండ్ తప్పదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.