కోర్టులో పిటిషన్లు వేయడం, కౌంటర్ ప్రకటనలు చేయడం.. వంటి విషయాల్లో ముందుంటారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు కూడా ఈయన కౌంటర్ గా ఒక సినిమాను తీయబోతున్నట్టుగా ప్రకటించారు. ఆ సినిమాకు టైటిల్ కూడా ప్రకటించారు. ఏదో లక్ ను కూడా విడుదల చేసి 'లక్ష్మీస్ వీరగంథం' అంటూ పేపర్లకు'యాడ్స్ ఇచ్చారు.
ఆర్జీవీ తన సినిమా గురించి అప్ డేట్ ఇచ్చినప్పుడల్లా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా ఏదో ఒక హడావుడి చేస్తూ వచ్చారు. అయితే చివరకు ఆర్జీవీ సినిమా రానే వచ్చింది. కానీ.. కేతిరెడ్డి సినిమా అడ్రస్ లేకుండాపోయింది.ఇక తాజాగా 'సైరా నరసింహారెడ్డి' విషయంలో కూడా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోర్టు పిటిషన్ తో వార్తల్లోకి వచ్చారు. చరిత్రను వక్రీకరించి ఆ సినిమాను రూపొందించారని, విడుదల ఆపాలని ఆయన కోర్టు కోరారు.
అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. పిటిషన్ ను కొట్టి వేసింది. చరిత్ర ఆధారంగా, చరిత్రలోని వ్యక్తుల ఆధారంగా చాలా సినిమాలు వస్తున్నాయని, అయితే వాటన్నింటిలోనూ చరిత్రను యథాతథంగా చూపడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని, సినిమా అంటే వినోదమంటూ.. సినిమాను సినిమాలాగే చూడాలంటూ కోర్టు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. విడుదల ఆపాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసి.. సైరా సినిమాకు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గండాన్ని తప్పించింది న్యాయస్థానం.