పాన్ ఇండియా సినిమాల వైపు మన హీరోలే కాదు..డైరక్టర్లు కూడా చూస్తున్నారు. సరైన ఒక్క హిందీ సినిమా కొడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నట్లుంది వ్యవహారం.
ఎందుకుంటే తెలుగు సినిమా రెమ్యూనిరేషన్లు వేరు..బాలీవుడ్ లెక్కలు వేరు. డైరక్ట్ బాలీవుడ్ సినిమా ఒక్కటి చేతిలో పడితే పదుల కోట్ల రెమ్యూనిరేషన్ అందుకోవచ్చు. అదే టైమ్ లో ఇక్కడ హీరోల డేట్ ల సమస్య కూడా వుంది. ఇక్కడ అందరు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియాల మీద పడ్డారు. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, బన్నీ, మహేష్ ఇలా ఎవ్వరూ మరో రెండేళ్ల వరకు ఖాళీ లేరు. పైగా వాళ్లందరికీ పక్క భాషల డైరక్టర్లు కావాల్సి వస్తోంది. కేవలం సీనియర్ హీరోలు నాగ్, వెంకీ, రవితేజ, చిరు మాత్రమే మిగిలారు.
అందుకే మన డైరక్టర్లు కూడా వేరే భాషల హీరోల వైపు చూస్తున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి విజయ్ తో సినిమా చేసారు. వెంకీ అట్లూరి ధనుష్ తో చేసారు. తరువాత సినిమా కోసం దుల్కర్ సల్మన్ వైపు చూస్తున్నారు. శేఖర్ కమ్ముల ధనుష్ తో సినిమా బిజీలో వున్నారు. సందీప్ వంగా రెండో హిందీ సినిమా చేసేసారు. హను రాఘవపూడి కూడా ఇప్పుడు పాన్ ఇండియా మల్టీ స్టారర్ ప్లానింగ్ లో వున్నారు. దిల్ రాజు తన టీమ్ డైరక్టర్లు ఒక్కొక్కరినీ తమిళ రంగానికి పరిచయం చేసే ఆలోచనలో వున్నారు.
కేవలం అవకాశాల కోసమే కాదు, రెమ్యూనిరేషన్ పరంగా కూడా పాన్ ఇండియా ఇమేజ్ వస్తే వేరుగా వుంటుంది. అర్జున్ రెడ్డి లాంటి చిన్న సినిమా చేసి, హిందీ రంగానికి వెళ్లిపోయిన సందీప్ వంగా ఇప్పుడు అందుకుంటున్న రెమ్యూనిరేషన్ 50 కోట్లు ప్లస్ ప్రాఫిట్ షేరింగ్ అని టాక్. ఎన్ని ఓన్లీ తెలుగు సినిమాలు చేస్తే వస్తుంది? మన దగ్గర సుకుమార్..కొరటాల..త్రివిక్రమ్ లాంటి వాళ్లు తప్ప మిగిలిన వారు ఇంకా ఇరవై కోట్ల రేంజ్ కు, ఆ పైకి చేరలేదు. ఇప్పుడిప్పుడే బోయపాటికి ఈ రేంజ్ ఆఫర్లు వస్తున్నాయి.
అదే కనుక ఒక్క పాన్ ఇండియా సినిమా చేసి సక్సెస్ కొడితే రెమ్యూనిరేషన్ ఎక్కడికో వెళ్లిపోతుంది. హీరోలకు అలాగే వుంది. దర్శకులకు అలాగే వుంది. రానా లాంటి హీరో మన దగ్గర తీసుకున్న రెమ్యూనిరేషన్ తక్కువే. అలాంటిది ఒక వెబ్ సిరీస్ కు ఎనిమిది కోట్ల వరకు వచ్చిందని బోగట్టా. వెంకటేష్ ఎఫ్ 3 సినిమాను పక్కన పెడితే తీసుకున్న రెమ్యూనిరేషన్ అయిదారు కోట్లే. అలాంటిది ఒక వెబ్ సిరీస్ కు 12 కోట్ల వరకు ఇచ్చారని తెలుస్తోంది.
అందుకే మన దర్శకులు..హీరోల టాప్ మోస్ట్ టార్గెట్ పాన్ ఇండియా..అంతకు మించి బాలీవుడ్ సినిమా.