అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 9న విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు ఇవ్వడం గమనార్హం. కవితకు నోటీసుల ముందు మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది.
తాను కవిత బినామీగా అరుణ్ పేర్కొన్నట్టు ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. అసలే బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది. ఈ ఏడాది ఆఖరులో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలనే పట్టుదలతో బీజేపీ వుంది. మరోవైపు మూడో సారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉదంతం బీజేపీకి వజ్రాయుధం అయ్యింది. దీన్ని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ను బలహీన పరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదే సందర్భంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న కవిత గట్టిగా నిలబడేందుకు ప్రయత్నిస్తుండడం విశేషం. తనను కేంద్ర దర్యాప్తు సంస్థ మొదటి సారి విచారించినప్పటి నుంచి ఆమె మరింత దూకుడుగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గురువారం విచారణకు రావాలని ఈడీ నుంచి నోటీసులు కవితకు అందడం తీవ్ర చర్చనీయాంశమైంది. లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రకు సంబంధించి అన్ని ఆధారాలు పెట్టుకునే వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం కథ నడిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. కవిత విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఆమెను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అయ్యిందనే ఊహాగానాలు చెలరేగాయి.
అందుకే విచారణ నిమిత్తం ఢిల్లీ రావాలని ప్రత్యేకంగా నోటీసులు ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో కవితను హైదరాబాద్‌లో ఆమె ఇంట్లోనే విచారించడం గమనార్హం. ఇప్పుడు వేదిక మారడం వెనుక బలమైన కారణమే వుంటుందనేది అందరి ఆలోచన.