రాష్ట్రప్రభుత్వం ఎన్ని మెట్లు దిగివచ్చినా సరే.. ఉద్యోగసంఘాలు మొండిపట్టు పడుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎంతగా సానుకూల వైఖరి అవలంబిస్తున్నప్పటికీ, వారి అతిశయమైన నిర్ణయాలను, పోకడలను పెద్దగా సీరియస్ గా తీసుకోకపోతున్నప్పటికీ.. ఉద్యోగులు మాత్రం తెగేదాకా లాగుతున్నారా? అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది.
ఉద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం లేవనెత్తడానికి పిలుపు నిచ్చాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన అనేకమంది పెద్దలు ఉద్యోగ నేతలతో చర్చలు జరిపి మార్చి నెల ముగిసేలోగా.. వారు కోరుకుంటున్నట్లుగా మూడువేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం అంగీరించింది. ఆరునెలల్లోగా అయిదువేల కోట్ల రూపాయల పీఆర్సీ డీఏ బకాయిలను రెండు విడతలుగా చెల్లించడానికి ఒప్పుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఈ చెల్లింపులు ఇంత హఠాత్తుగా పీకలమీద కూర్చుని చెల్లించమని అడిగితే.. ప్రభుత్వానికి ఇబ్బందే. అయినా సరే.. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నది.
అయితే ఉద్యోగుల్లో స్పందన ఎలా ఉన్నదో గమనిస్తోంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇన్ని ఇబ్బందుల మధ్య తమ ఆర్థిక డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తున్నందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేయాల్సింది బదులు.. ఉద్యమం యథావిధిగా కొనసాగుతుందని అంటున్నారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ.. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తోంటే.. సీపీఎస్, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పొరుగు సేవల జీతాల పెంపు వంటి అనేక అలవిమాలిన కోరికలను ఉద్యోగ సంఘాల నేతలు ఇంకా బయటపెడుతున్నారు. ప్రభుత్వం మెట్టు దిగి వస్తున్న కొద్దీ వీరు మరింత కొండెక్కిపోతున్నట్టుగా కనిపిస్తోంది. అలాంటి అలవిబాలిన డిమాండ్లు తీరలేదనే విషయాన్ని ముందుకు తెస్తూ.. ఉద్యమాన్ని కొనసాగిస్తాం అంటున్నారు. బకాయిలు చెల్లించినంత మాత్రాన ఉద్యమం విషయంలో చర్చించి గానీ నిర్ణయం తీసుకోలేం అంటున్నారు.
వీరి మొండిపట్టుదల చూస్తే.. ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించే కార్యక్రమాలు చేస్తున్నట్టుగా లేదు. ప్రతిపక్షాల చేతిలో కీలుబొమ్మలుగా మారి, వారి ఎజెండా మేరకు పనిచేస్తూ, వారి స్క్రిప్టు ప్రకారం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి పూనుకుంటున్నట్టుగా ఉంది.