ఒకప్పుడు టాలీవుడ్ లో సంగీత దర్శకుడు మణిశర్మ శకం నడిచింది. ప్రతి హీరో సినిమాలకు మణిశర్మనే సంగీతం. పాటలన్నీ బ్లాక్ బస్టర్లే. హీరోలు ట్యూన్ లు కూడా వినేవారు కాదు. మణిశర్మ ఛాయిస్ కే వదిలేసేవారు. అంతటి నమ్మకం. అలాంటి మణిశర్మ తరువాత తరువాత వెనకబడిపోయారు.
ఇస్మార్ట్ శంకర్ తరువాత మళ్లీ మణిశర్మ శకం మొదలైందని అనుకున్నారు. కానీ ఆ సినిమా తరువాత మళ్లీ గొప్ప పాటలు చేయలేకపోయారు. కానీ మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ మాత్రం బిజీ అయ్యారు.
మహతి లేటెస్ట్ చేసిన ట్యూన్ తో వచ్చిందో పాట. మెగాస్టార్ భోళాశంకర్ లో చిరు-తమన్నాల డ్యూయట్ కోసం ఈ ట్యూన్ చేసారు.మరి చిరంజీవి అడిగారో, లేదా దర్శకుడు మెహర్ రమేష్ కోరుకున్నారో, పక్కా వింటేజ్ మణిశర్మ ట్యూన్ తో వచ్చింది పాట. ‘అచ్చా.. అచ్చ తెలుగు పచ్చి మిర్చి మొగాడు వీడు.. బొంబాట్ ఘాటు.. హాటు గున్నాడే… అంటూ ప్రారంభమైన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు.
మహతి స్వరసాగర్ పాడడం విశేషం. మహతితో పాటు విజయ్ ప్రకాష్..సంజన కూడా గొంతు కలిపారు. ఈ పాట మెయిన్ ట్యూన్ అయిన ‘పంచదార చిలకలాంటి ప్యారీ సుకుమారి ‘ అనే లైన్స్ దగ్గరకు వచ్చేసిరికి అనేకానేక మణిశర్మ పాటలు గుర్తుకు వస్తాయి. పాట చాలా కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. మెగాస్టార్ లుక్స్ బాగున్నాయి. తమన్నా సరేసరి. ఇప్పటి వరకు భోళా నుంచి వచ్చిన పాటల్లో ఇదే క్యాచీగా వుంది. ఓల్డ్ స్టయిల్ అయినా సినిమాలో ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ది కీలకపాత్ర. ఆగస్టు రెండో వారంలో విడుదలవుతోంది.