నమ్మకం అమ్మ వంటిది.. ఒక్కొసారి సవితి తల్లిలా కూడా ప్రవర్తిస్తూ వుంటుంది. చేరదీసి ఉద్యోగం ఇచ్చిన వారి బొక్కసానికే కన్నం వేస్తుంటుంది. డిజిటల్ మీడియాలో ఫుల్ ఫామ్ లో వున్న మ్యాంగో సంస్థకు ఓ ఉద్యోగి టోకరా వేసి రెండు కోట్ల వరకు కొట్టేసినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. అయితే చాలా తెలివిగా చేసిన పని కావడంతో, కేసు పెట్టే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది.
విషయం ఏమిటంటే మ్యాంగో సంస్థలో ఓ వ్యక్తి నమ్మకంగా చేరాడు. పని బాగానే చేస్తుండడంతో, లోపలికి చొచ్చుకుపోయాడు. అయితే సినిమా పరిశ్రమలో క్యాష్, ఆన్ లైన్ ఇలా రకరకాల ట్రాన్సాక్షన్లు వుంటాయి. ఇతగాడు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ల మీద కన్నేసినట్లు తెలుస్తోంది. మెల్లగా అవి మాయం చేయడం ప్రారంభించిన తరువాత కొన్ని చెక్ లు తన పేరు మీద తీసుకోవడం మొదలైంది. అక్కడ అతగాడి మాటల చాతుర్యం పని చేసింది.
తీరా సంస్థ ఓనర్ దృషికి ఇవన్నీ వచ్చేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కోటో.. రెండు కోట్లో పక్కదారి పట్టేసాయి. కానీ తీసుకున్నవి క్యాష్ పార్ట్ కావడంతో ఏ విధంగా రుజువులు సాక్ష్యాలు వుంటాయి. చెక్ లు కూడా అతని పేరున ఇచ్చినవి అతను క్యాష్ చేసుకున్నాడు. ఎంత చీటింగ్ కేసు పెట్టినా, రుజవు కావడానికే అయిదు..పదేళ్లు పట్టేస్తుంది.
మ్యాంగో సంస్థ అధినేతలు ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారు. అతగాడు మాత్రం హ్యాపీగా వేరెే సంస్థల్లో చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నాడట.