ముల్లుని ముల్లుతోనే తియ్యాలంటారు.
వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు.
కుక్కకాటుకి చెప్పుదెబ్బ అని కూడా అంటారు.
ఈ సామెతలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాజా ప్రసంగం చూస్తే గుర్తుస్తాయి.
చంద్రబాబుని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని, బాలకృష్ణని విమర్శిస్తూ వారి వ్యక్తిత్వాల్ని బజారుకీడ్చేసారు ముఖ్యమంత్రి.
అయితే ఆయన చెప్పిన విషయాల్లో కొత్తవేమీ లేవు. అన్నీ అందరికీ తెలిసిన పాతచింతకాయలే. కొందరు మంత్రులు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో జనాలు తరచూ చెప్పేవే.
పవన్ కళ్యాణ్ ని మూడు పెళ్లిళ్ల అంశంతో విమర్శించడం వినీ వినీ జనానికే విసుగొచ్చేసింది. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ రాష్ట్ర వలంటీర్లని అమ్మాయిల బ్రోకర్లుగా చిత్రీకరించడం వల్ల, సాక్షాత్తూ ముఖ్యమంత్రే పవన్ కళ్యాణ్ ని “అమ్మాయిల్ని మోసం చేసి వదిలేసే వ్యక్తి” అనడం సందర్భానికి తగ్గట్టు ఉంది. మేటర్ పాతదే అయినా టైమింగ్ వల్ల, ముఖ్యమంత్రి స్వయంగా విమర్శించడంవల్ల ప్రత్యేకతని సంతరించుకుంది.
పైగా పవన్ ఈ మధ్యన మాట్లాడుతూ “జగ్గూ భాయ్” అని ముఖ్యమంత్రిని సంబోధించడం, “గారు” అనను ఏకవచనంతోనే పిలుస్తాను అని పొగరు చూపించడం మొదలైన కారణాల వల్ల జగన్ ఇగో హర్టయ్యింది. అది మానవసహజం.
“నీ కుర్చీకి గౌరవం ఇచ్చేలా మాట్లాడు” అనే వ్యక్తే ఆ కుర్చీకి గౌరవం ఇవ్వకపోతే ఎలా? పార్టీ పెట్టి పదేళ్లైనా ఎమ్మెల్యేగా గెలవని పవన్ కల్యాణ్ కి, ఒక్క ఎమ్మెల్యేని కూడా నిలబెట్టుకోలేని పవర్ స్టారుకే అంతుంటే పార్టీ పెట్టిన నాలుగేళ్లకే 151 మంది ఎమ్మెల్యే సీట్లను గెలిచి ముఖ్యమంత్రైన జగన్ కి ఎంతుండాలి? ఈ మాత్రం కాకిలెక్క కూడా వేసుకోలేకపోయాడా పవన్?
ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ప్రతిపక్షాలు ఉన్నది విమర్శించడానికే .అందులో సందేహం లేదు. కానీ అవి పరిపాలనా అంశాలయ్యుండాలి. కానీ వెల్ఫేర్ స్ఖీముల్ని విమర్శిస్తే మొదటికే మోసం వస్తుంది. అభివృద్ధి లేదని మాట్లాడుతుంటే సామాన్య ఓటర్ కనెక్ట్ అవ్వడని అనుకున్నారో ఏమో ఎంతసేపూ వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు తెదేపా వారు.
కొంతమంది పెయిడ్ ఆర్టిష్టుల్ని కూర్చోబెట్టి అందరికీ ఒకటే స్క్రిప్ట్ ఇచ్చి జగన్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేయిస్తుంటుంది తెదేపా. ఇందులో భాగంగా బాబాయి హత్య మొదలైన అంశాలమీద వ్యక్తిగత దాడులు చేయడం వల్ల జగన్ ప్రతిదాడిగా చంద్రబాబు, లోకేష్, బాలయ్యల క్యారెక్టర్స్ ని బయటపెట్టాల్సొచ్చింది.
అప్పట్లో ఒక ఆడియో ఫంక్షన్లో “అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేసేయాలి” అని బాలకృష్ణ అన్న మాటల్ని గుర్తుచేయడం, స్విమ్మింగ్ పూల్లో పదిమంది అమ్మాయిలతో లోకేష్ కామలీలల తాలూకు ఫొటోస్ ను గుర్తు చేయడం, అన్-స్టాపబుల్ షోలో చంద్రబాబు సైతం తన రియల్ లైఫులో చేసిన వెధవపనుల్ని గొప్పగా చెప్పుకోవడాన్ని ప్రస్తావించడం..అన్నీ సందర్భోచితంగా ఉన్నాయి. స్వపక్షాలు, వైకాపా అభిమానులు, సానుభూతిపరులు చప్పట్లు కొట్టేలా ఉన్నాయి.
పైగా ముఖ్యమంత్రి చేసినవి ఆరోపణలు కాదు. జనంచూస్తున్న పచ్చి నిజాలు. పవన్, చంద్రబాబు వలంటీర్ల గురించి మాట్లాడింది మాత్రం సాక్ష్యాలు లేవు కనుక అభియోగమే. అందుకే పూసిన అభియోగపు బురదని కడుక్కునే పని పెట్టుకోకుండా, పూసిన వాళ్లు ఎంత బురదలో కూరుకుపొయారో అన్న సత్యాన్ని జనానికి తన మాటల్లో చెప్పారు ముఖ్యమంత్రి.
ఇదంతా చూసిన కొందరికి “ముఖ్యమంత్రి స్థాయి మనిషి ఇలా మాట్లాడొచ్చా” అంటూ ఫీలైపోతున్నారు. దాడి చేసినప్పుడు ప్రతి దాడి చెయ్యక ఏం చెయ్యాలి? పక్క రాష్ట్రంలో కేసీయార్ నోటికంటే జగన్ మోహన్ రెడ్డి నోరు పదింతలు మేలు. పవన్ కళ్యాణ్ ని టుకడా టుకడా చేస్తానన్న వ్యక్తి కేసీయార్. ఆ డైలాగ్ కి పవర్ స్టార్ దగ్గర కౌంటర్ డైలాగ్ కూడా లేదు. భయపడిపోయి ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ కేటీయార్ కి ఒక దండంపెట్టి ఫ్రెండ్షిప్ చేసుకుని భీమలా నాయక్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పిలుచుకుని తరించిన భీరువు పవన్ కళ్యాణ్.
అంతా బానే ఉంది. అయితే ముఖ్యమంత్రైనా, ప్రతిపక్ష నాయకులైనా ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు, సమాధానలతో సరిపెడుతూ ప్రసంగాలు చేస్తే సరిపోదు. నిజానికి ఎవడి వ్యక్తిగత జీవితం ఏదైతే ఏంటి? పదవొస్తే ఎవరేం చెయ్యలేదో, ఎవరేం చేద్దామనుకుంటున్నారో చెప్పడం అసలు పని. దానిని వదిలేసి ఎంతసేపూ వ్యక్తిగత ఆరోపణలు, సమాధానాలేనా?
వైకాపా నేతగా జగన్ మోహన్ రెడ్డిగా చేసిన ప్రసంగం బాగుంది. కానీ ఆయన ముఖ్యమంత్రిగా చెయ్యాల్సిన ప్రసంగం ఇంకా మిగిలే ఉంది. ప్రతిపక్షాల నోళ్లు మూయించడానికి, ఒకవేళ తెరిచినా జనంపట్టించుకోకుండా చేయడానికి ఆయన చెయ్యాల్సిన ప్రసంగాలు చాలా ఉన్నాయి.
కేవలం సంక్షేమ పథకలతో గోదావరి ఈదేస్తానంటే అదంత తెలివైన పని అనిపించుకోదు. సర్వేలని నమ్ముకుని కాలయాపన చేస్తే తర్వాత ఆకులుపట్టుకుని ప్రయోజనం ఉండదు. రానున్న కాలంలో సంక్షేమపథకాలు కొనసాగించడానికి నిథుల సమీకరణ ఎలాగ? పారిశ్రామికంగా వేసిన అడుగులవల్ల రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలేవిటి? రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణాల మాటేవిటి? వీటికి సమాధానాలు చెప్పాల్సిన సమయం ఇది.
అసలంటూ చెబితే దానిమీద ప్రతిపక్షాలు తమశైలిలో ప్రశ్నలు సంధిస్తాయి. అప్పుడు సమాధానాలు చెప్పాలి. అగ్రరాజ్యం అమెరికాలో సైతం ఎన్నికకాబోయే ప్రెసిడెంట్ కేండిడేట్స్ మధ్య ఇలాంటి వాదప్రతివాదనలే జరుగుతాయి. చదువుకున్న సమాజానికి అద్దంపట్టే విధానం అది.
ఆ పరిస్థితి ఆంధ్రలో ఆశించడం తప్పు కాదు కదా! జనం చప్పట్ల కోసం ప్రతిపక్షాల అధినేతలు ప్రజలకి పనికిరాని మాస్ మసాలా స్పీచులివ్వడం, వాటికి మరింత మాస్ ని జోడించి ముఖ్యమంత్రి పంచ్ డైలాగులు కొట్టడం…ఇవి కాదు కదా ఆశించేది.
కనుక ఇకనైనా ఇరుపక్షాల నాయకులు టిక్-టాక్ కామెడీ వీడియోల టైపులో కాకుండా, ప్రజలకి పనికొచ్చే విధంగా మాట్లాడతారని ఆశిద్దాం..అంత ఆశలేకపోయినా అబ్దుల్ కలాం చెప్పినట్టు కనీసం కలలైనా కందాం!
శ్రీనివాసమూర్తి